Tuesday, November 12, 2024

TG | కేశంపేట పీఎస్ నుంచి హరీశ్ రావు విడుదల..

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు పోలీస్‌ స్టేషన్‌లో నుంచి విడుద‌ల‌య్యారు. కేశంపేట పీఎస్ నుంచి ఆయ‌న‌ హైదరాబాద్ బయలుదేరారు. హ‌రీశ్ రావు తో పాటు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో హరీశ్‌రావు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసనలు విరమించాలని కోరారు.

కాగా, కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేసిన వారిపై 307 కింద కేసు నమోదు చేస్తామని రాష్ట్ర డీజీపీ హామీ ఇచ్చారని… బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడికి పాల్ప‌డ్డ వారిపై కూడా చర్యలు తీసుకుంటామని డీజీపీ హామీ ఇచ్చిన‌ట్లు హరీశ్ రావు తెలిపారు. ఒకవైపు గణేష్ నిమజ్జనం జ‌రుగుతొంద‌ని…. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు డీజీపీ హామీ మేరకు అందరం ఇక్కడి నుంచి బయలుదేరి వెళతామని ఆయ‌న తెలిపారు.

కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా పోలీసులు కూడా తమ మాటపై నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అధికారం శాశ్వతం కాదని… ఈరోజు కాంగ్రెస్‌ పార్టీ వ‌ద్ద‌ ఉండొచ్చు, రేపు మా దగ్గర ఉండొచ్చు.. కానీ చట్టం, న్యాయం పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. మేం వెళ్లిన తర్వాత పోలీసులు కార్యకర్తలకు ఆటంకం కల్పిస్తే మళ్లీ ఇక్కడికి వచ్చి నిరసన తెలపాల్సి వస్తుంద‌ని అన్నారు. జిల్లాలోనూ బీఆర్‌ఎస్‌ కార్మికులను బైండోవర్ చేసినట్లు సమాచారం వ‌చ్చింద‌ని… వారందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఇక‌ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు, నాయకులకు ఎన్ని రకాల కృతజ్ఞతలు చెప్పినా త‌క్కువే అని అన్నారు. కొద్ది నిమిషాల్లోనే మమ్మల్ని అరెస్టు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నారని తెలియగానే ప్రాణాలకు తెగించి వచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కార్య‌క‌ర్త‌లంద‌రూ తమ గమ్యస్థానానికి క్షేమంగా చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement