Thursday, December 12, 2024

TG | ఏడాది పాలనలో గురుకులాలు, హాస్టళ్ళు ఆగమాగం : హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రశాంత్ నగర్ ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ హాస్టల్‌లో గురువారం సాయంత్రం మాజీ మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేసిన హరీశ్ రావు… వసతి గృహంలో నెలకొన్న సమస్యల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

రేవంత్ రెడ్డి ఏడాది పాలనతో గురుకులాలు, హాస్టళ్లు అన్నీ ఆగమైపోయిన పరిస్థితి నెలకొందని అన్నారు. రేవంత్‌రెడ్డి హయాంలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యార‌ని… 49 మంది విద్యార్థులను ప్రభుత్వం పొట్టన పెట్టుకుందని ఆరోపించారు.

- Advertisement -

‘‘3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ,బీసీ పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదు. కెసిఆర్ 1000కి పైగా గురుకులాలు స్థాపించి గురుకులాల గౌరవాన్ని ఎవరెస్టు శిఖరం అంత ఎత్తులో పెట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఎస్సీ, ఎస్టీ హాస్టళ్ళకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారు. ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కు జూన్ నుండి నవంబర్ వరకు ఆరు నెలలుగా మెస్ చార్జీల చెల్లింపులు జరగలేదు. దాదాపు తొమ్మిది లక్షల 50 వేల రూపాయలు బిల్లులు పెండింగులో ఉన్నాయి.

హాస్టల్ వార్డెన్లు బంగారం కుదవబెట్టి అప్పులు తెచ్చి విద్యార్థులు ఆకలి తీరుస్తున్నారు. మెస్ చార్జీలు సకాలంలో చెల్లించకపోతే విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఎలా పెడతారు?. విద్యార్థులు ఆసుపత్రి పాలైతే ఉపాధ్యాయులను, వార్డెన్లను సస్పెండ్ చేస్తా అంటున్నావ్. శిక్ష రేవంత్ రెడ్డికి వెయ్యాలి. మెస్సు బిల్లులు చెల్లించండి. మెసేజ్ చార్జీలు పెండింగ్ లో పెట్టింది రేవంత్ రెడ్డి, కాబట్టి శిక్ష ముఖ్యమంత్రికి వేయాలి.

రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతాయి చేతలు గడప కూడా దాటవు. రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉందేమో. గత సంవత్సరం విద్యార్థులకు ప్లేటు, గ్లాసు, స్పూన్, టవల్స్, స్కూల్ యూనిఫార్మ్స్ అన్ని సకాలంలో అందాయి. ఈ సంవత్సరం ఇవేవీ ఇవ్వలేదు అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ పుట్టిన రోజుకు ఫుల్ పేజీ పేపర్ యాడ్ ఇస్తున్నారు. తొమ్మిది రోజుల విజయోత్సవాలు జరుపుకున్నారు. కానీ ఈ పిల్లలకు బుక్కెడు అన్నం పెట్టే చాతకాదా? విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నావా?

ఆడపిల్లల హాస్టల్లలో చలికాలం వేడి నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్, నవంబర్ మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. పార్ట్ టైం ఉద్యోగులకు 8 నెలలుగా జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదు. 8 నెలల నుండి జీతాలు చెల్లించకపోతే వారు ఎలా పని చేస్తారు? వాళ్ళ కుటుంబాన్ని ఎలా పోషిస్తారు.?

ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ఆరు నెలలుగా కాస్మెటిక్ చార్జీలు పెండింగ్ లో ఉన్నాయి. ఇదీ రేవంత్ రెడ్డి ఏడాది పాలన! కోతలు ఎక్కువ చేతలు తక్కువ. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు సత్యవతి రాథోడ్ గారు.. వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ వల్ల బాలికలు ఆసుపత్రిలో పాలైతే వారిని పరామర్శించేందుకు వెళ్తుండగా ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గం.

ప్రభుత్వం సక్రమంగా హాస్టళ్ళు నడుపుతున్న మాట నిజమైతే మాజీ మంత్రులు పోతుంటే ఎందుకు అడ్డుకున్నావు రేవంత్ రెడ్డి?మీ తప్పులు, మీ లోపాలు బయటపడతాయని సబితని అడ్డుకున్నారు. అరెస్టులు కాదు చేయాల్సింది, పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టు. సంవత్సర కాలం నుంచి హాస్టల్ భవనాలకు అద్దెలు చెల్లించడం లేదు. వెంటనే హాస్టల్ రెంట్లను చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి పూర్తిగా విఫలమయ్యారు. ముఖ్యమంత్రి ఏనాడైనా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్ కు వెళ్లి విద్యార్థుతో భోజనం చేసావా?. ఒకనాడైనా విద్యార్థులను పరామర్శించావా? అధికారంలోకి వచ్చాక ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను విస్మరిస్తున్నాడు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డి ప్రాధాన్యతలు వేరు. ఫోర్త్ సిటీ కడతా ఆరు లైన్ల రోడ్డు మీ భూముల దాకా వేసుకుంటా.. ఇవి నీ ప్రాధాన్యతలు.కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరుతో వృథా చేశారు. పిల్లలు భోజనం చేసే అన్నం చూస్తే ఆవేదన కలిగింది. మీరు దొడ్డు బియ్యంతో అన్నం పెడుతుంటే ముద్దలాగ అయిన అన్నాన్ని విద్యార్థులు తినలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తక్షణమే ప్రభుత్వం హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలి. ఆరు నెలలుగా సిద్దిపేట ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కి బిల్లులు విడుదల చేయలేదు. ఆరు నెలలుగా బిల్లులు లేకుండా విద్యార్థులకు భోజనం ఏ విధంగా పెడతారు? అటెండర్ అన్నం పెడుతున్నప్పుడు విద్యార్థులు అర్ధాలతో ఉన్నారు మెస్ బిల్లులు విడుదల చేయాలని గుర్తు చేయండి.

కనీసం అన్నం తినేటప్పుడు అయినా విద్యార్థులు గుర్తొచ్చి మెస్ బిల్లులు విడుదల చేస్తాడేమో. పాలన అంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ప్రతిపక్ష నేతలను అరెస్టు చేయడం కాదు. పాలన అంటే ఇచ్చిన హామీలను అమలు చేయడం. ప్రజల మధ్యలో ఉండడం. పోలీసుల మధ్య ఉండడం కాదు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారు మూ అక్రమ కేసులు పెట్టి జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పెట్టాల్సింది అక్రమ కేసులు కాదు పేద విద్యార్థులకు అన్నం పెట్టు.” అని హరీశ్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement