Thursday, September 19, 2024

TG | అదృష్టం బాగుంటే ఐదేళ్లుంటావు… సీఎం రేవంత్‌పై హరీష్‌ రావు ఫైర్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ:అబద్ధాలు, అసత్య వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, అదృష్టం బాగుంటే ఐదేళ్లు అధికారంలో ఉంటారని లేని పక్షంలో ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్‌ఎస్‌ నేత, మాజీమంత్రి హరీష్‌రావు హెచ్చరించారు.

పగటికలలతో కాలక్షేపం చేస్తే ప్రయోజనం ఉండదని అన్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ గెలిస్తే ఐదేళ్లలోనే ప్రభుత్వాలు పడిపోయాయని గుర్తుచేశారు. నీఅదృష్టం బాగుంటే ఐదేళ్లు ఉంటావు, మంచిగా పరిపాలించి ప్రజల మనస్సును గెలుచుకో అంటూ హితవు చెప్పారు.

రాజకీయ కుట్రలతో వ్యవహరిస్తున్న సీఎం రేవంత్‌ రెడ్డి గుండెల్లో నిద్రపోతానని, ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలిపెట్టనని, ఆయన గుండెల్లో నిద్రపోతానని మండిపడ్డారు. దేవుళ్ల మీద ప్రమాణంచేసినా, నీతిమాలి, బాధ్యత మర్చి తిట్ల పురాణం అందుకున్నా పట్టించుకోనని స్పష్టం చేశారు. వెంపలి చెట్టు అంత ఉన్న నీవు నాఎత్తుగురించి మాట్లాడుతావా అంటూ మండిపడ్డారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూములను కాపాడితే రియలెస్టేట్‌ దందా చేసేందుకు ఫోర్త్‌ సిటీ, ఫార్మాసిటీ అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. ఆదివారం సీఎం రేవంత్‌ చేసిన విమర్శలపై స్పందించిన హరీష్‌రావు తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ తీవ్ర విమర్శలు చేశారు.

రుణమాఫీ అమలైనట్టు నిరూపిస్తావా?

- Advertisement -

రైతు రుణమాఫీ ఎక్కడ పూర్తిగా అమలైందో చూపిచు వస్తానని హరీష్‌ రావు సవాల్‌ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వరదలకంటే ముఖ్యమంత్రి అబద్ధాల వరద కంపులో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని దుయ్యబట్టారు. తన ఎత్తుపై పరుష పదజాలంతో మాట్లాడిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఆయన విరుచుకు పడ్డారు. తాను తాటి చెట్టు అంత ఎత్తు ఎదిగినా నువ్వు వెెంపలి చెట్టు అంతా ఎత్తుకూడా ఎదగలేదని ఎద్దేవా చేశారు.

సీఎం కుర్చికి మర్యాద దక్కాలంటే మర్యాదగా వ్యవహరించాలనే కనీస పరిజ్ఞానం ఆయనకు లేదన్నారు. సీఎం భాష, వ్యవహర శైలి, నడవడిక మర్యాదగా ఉన్నప్పుడే కుర్చికి మర్యాద లభిస్తుందని,నోరు తెరిస్తే బూతులు, అబద్ధాలు మాట్లాడితే మర్యాద ఎలా వస్తుందని అన్నారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఎన్నో అబద్దాలు,ఆరోపమలు, విమర్శలు చేశారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

ఎంత తిట్టినా నా అంత ఎత్తు పెరగలేవు

సీఎం రేవంత్‌ రెడ్డి తన గురించి ఏం మాట్లాడినారో ప్రజలంతా విన్నారని హరీష్‌ రావు గుర్తు చేశారు. తాటిచెట్టంత పెరిగావు.. దూడకున్నంత మెదడు లేని సన్నాసి ఎక్కడ దాక్కున్నావని సీఎం తనను ఉద్దేశించి అన్నారని, కానీ తను అలా మాట్లాడానికి మర్యాద, సంస్కారం అడ్డు వస్తున్నాయని చెప్పారు. నీవు లిల్లిపుట్‌ అంత లేవు అని అనలేనా? సన్నాసి అనడం పెద్ద కష్టం కాదని అన్నారు. నా ఎత్తు గురించి దుర్భషలాడుతున్నావు. నా ఎత్తు మీద నీకు అంత ఈర్ష్య ఎందుకు, అది భగవంతుడు ఇచ్చిన వరమని అన్నారు. ఎంత తిట్టినా, ఎంత మాట్లాడినా తన అంత ఎత్తు పెరగలేవని,రేవంత్‌ రెడ్డికి ఆదశ దాటిపోయిందని హరీష్‌ రావు అన్నారు.

రుణమాఫీ చేసి ఆత్మహత్యలు నివారించాలి

రైతులందరికీ షరతులులేకుండా రుణమాఫీ చేసి ఆత్మహత్యలను నివారించాలని హరీష్‌ రావు సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్ చేశారు. దుర్మార్గపు నిబంధనలతో రైతు సురేందర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. రుణమాఫీ పూర్తి చేశానని దేవుళ్లమీద ఒట్టు వేసి అబద్ధాలు మాట్లాడావని అన్నారు.

రుణమాఫీ పూర్తి అయిందని నిరూపిస్తావా అంటూహరీష్‌ రావు సవాల్‌ విసిరారు. నిరుపిస్తానంటే నీ స్వగ్రామం కొండా రెడ్డి పల్లి చౌరస్తాకు వస్తానని సవాల్‌ చేసారు. రూ.31 వేల కోట్ల రుణమాఫీ కావల్సి ఉంటే ఇప్పటికీ కేవలం 17వేల కోట్లు మాత్రమేఅయిందన్నారు. పంటబోనస్‌ బోగస్‌ చేసిన సన్నాసి ఎవరని హరీష్‌ రావు ప్రశ్నించారు.

పింఛన్‌ 4వేలు అంటూమాట తప్పిన సన్నాసి సీఎం రేవంత్‌ రెడ్డి అంటూ హరీష్‌ రావు మండిపడ్డారు. అసలు ఫోర్త్‌ సిటీ ఎక్కడిది అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ కృషి చేసి 1500 కోట్లు ఖర్చు చేసి 12వేల ఎకరాలు సేకరించారని తెలిపారు. అక్కడ రియలెస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ఫోర్త్‌ సిటీ, ఫార్మా సిటీ పేరుతో భూముల దోపిడీ చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు స్వార్థపూరితమైనవన్నారు.

ముఖ్యమంత్రి ప్రజల ఇజ్జత్‌ తీస్తున్నావు, నీపరువు నీవే తీసుకుంటున్నావని అన్నారు. రీజినల్‌ రింగ్‌ రోడ్డుకోసం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెగకష్టపడిందని గుర్తు చేశారు. నార్త్‌ సైడ్‌ మేము చేయించాం సౌత్‌ సైడ్‌ నీవు చేయించని సవాల్‌ విసిరారు. బాధ్యతగా మాట్లాడు దంచుర్రు, కొట్టురి, చింతకాయ కొట్టుర్రి అంటూ మాట్లాడితే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతినదా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement