Friday, October 18, 2024

Tributes – సాయిబాబా వేద‌న‌కు స‌మాధానం చెప్పేదెవ‌రు?

బీఆర్ ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు
నివాళులు అర్పించిన నేత‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : సుధీర్ఘ కాలం జైలు జీవితం గడిపి, నిర్దోషిగా బయటకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ప్రొఫెస‌ర్ సాయిబాబా మరణించడం బాధ‌క‌ర‌మ‌ని, సాయిబాబా వేద‌న‌కు స‌మాధానం ఎవ‌రు చెబుతార‌ని బీఆర్ ఎస్ నేత‌, మాజీ మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు. మౌలాలి లోని సాయిబాబా నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి హ‌రీశ్‌రావు నివాళులు అర్పించారు. సాయిబాబా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

కుటుంబ స‌భ్యులు ప‌డిన వేద‌న వ‌ర్ణ‌నాతీతం
దశాబ్ద కాలం పాటు ఆయనతోపాటు, ఆయన కుటుంబ సభ్యులు పడిన వేదన వర్ణనాతీతం అని హ‌రీశ్‌రావు అన్నారు. ప్రొఫెసర్ గా పని చేస్తూ, ఆ హోదాలోనే ప్రాణాలు వదలాలని అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తూ ఉద్యోగం కూడా కోల్పోయారని, వంద మందికి శిక్ష పడినా ఒక నిర్దోషికి శిక్ష పడవద్దు అనేది మ‌న న్యాయ సూత్రమ‌ని, ఇది సాయిబాబా విషయంలో వర్తిస్తుందన్నారు. 90 శాతం అంగవైకల్యం ఉన్న వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తున్నార‌ని, అలాంటి వ్యక్తి పట్ల అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడం బాధాకర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాయిబాబా నిర్దోషిగా బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చే సమయంలో ఇలా జరగడంపై దుర‌దృష్ట‌మ‌న్నారు. తన శరీరాన్ని కూడా గాంధీ ఆసుపత్రికి డొనేట్ చేసిన సాయిబాబా ఆదర్శంగా నిలిచారన్నారు.

గన్ పార్క్ వద్ద సాయిబాబా పార్దివదేహం

- Advertisement -

గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద ప్రొఫెసర్‌ సాయిబాబా పార్థివదేహానికి పలువురు నివాళులర్పించారు. సీపీఐ నేత నారాయణతో పాటు పలువురు వామపక్ష నేతలు అంజలి ఘటించారు. సాయిబాబా అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. కామ్రేడ్‌ సాయిబాబా అమర్‌రహే, లాల్‌ సలాం, ఇంక్విలాబ్‌ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేశారు. గన్‌పార్కు వద్ద 5 నిమిషాల సంతాప సమావేశం ఏర్పాటు చేస్తామని కుటుంబసభ్యులు, అభిమానులు కోరగా.. పోలీసులు నిరాకరించారు. సాయిబాబా పార్థివదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి నిర్వహిస్తామని చెప్పినా అనుమతివ్వలేదు. దీంతో సాయిబాబా అభిమానులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అక్కడే 10 నిమిషాలు పాటు అంబులెన్స్ ను అక్కడే నిలిపారు.. అనంతం సాయిబాబా భౌతికకాయాన్ని మౌలాలిలోని ఆయన నివాసానికి తరలించారు.

సమాజాన్ని చదివిన మేధావి – నారాయణ ‍ ‍‍

పుస్తకాలు కాకుండా సమాజాన్ని చదివేవారు మేధావులని సీపీఐ నేత నారాయణ అన్నారు. సాయిబాబా అలాంటి వ్యక్తి అని కొనియాడారు. గన్‌పార్కు వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. సాయిబాబాను పదేళ్లు అన్యాయంగా జైల్లో నిర్బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. దోషి ఎవరో తేల్చాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాస్తామని నారాయణ చెప్పారు.

సాయిబాబా మృతికి కేంద్ర‌మే బాధ్య‌త – కోదండ రాం

సాయిబాబాపై కేంద్రం అణచివేత ధోరణితో వ్యవహరించిందని కోదండరామ్‌ తెలిపారు. ఆయన మృతికి కేంద్రం బాధ్యత వహించాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగ మౌలిక సూత్రాల అమలు కోసం సాయిబాబా పోరాడారని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులంతా ఆయన నిర్బంధాన్ని ఖండించారని కోదండరామ్‌ గుర్తుచేశారు.

కాగా, నేటి మ‌ధ్యాహ్నం ఆయ‌న‌కు కుటుంబ స‌భ్యులు అంతిమ సంస్కారాలు నిర్వ‌హించ‌నున్నారు. దివంగ‌త సాయిబాబా అంతిమ కోరిక ప్ర‌కారం ఆయ‌న పార్దివ దేహాన్ని ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి అప్ప‌గించ‌నున్నారు..ఇప్ప‌టికే ఆయ‌న నేత్రాల‌ను ఐ బ్యాంక్ కు దానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement