సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తట్టుకోలేకపోతున్నా… చనిపోయేందుక అనుమతివ్వండి అంటూ ఒక మహిళ న్యాయమూర్తి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం సంచలనం కలిగించింది.. వివరాలలోకి వెళితే ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆమె సీజేఐకి బహిరంగ లేఖ రాస్తూ.. సామాన్య ప్రజలకు న్యాయం చేసేందుకు న్యాయవాద వృత్తిలో చేరిన తానే ఇప్పుడు న్యాయం కోసం ప్రతి తలుపు తట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లా న్యాయమూర్తి, ఆయన అనుచరులు కొన్ని నెలలుగా తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు ఆరోపించారు. తనను పురుగు కంటే హీనంగా చూస్తున్నారని, రాత్రివేళ తనను ఒంటరిగా వచ్చి కలవమంటున్నారని ఆమె ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
తనపై జరుగుతున్న వేధింపులపై ఈ ఏడాది జులైలో హైకోర్టు అంతర్గత ఫిర్యాదుల కమిటీ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు ఆయనను మరో చోటికి బదిలీ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అభ్యర్థనను కొట్టివేశారని వాపోయారు. ఏడాదిన్నరగా జీవచ్ఛవంలా బతుకుతున్న తాను బతికి ఉండి ఎలాంటి ప్రయోజనం లేదని, తాను గౌరవప్రదంగా చనిపోయేందుకు అనుమతినివ్వాలని ఆ లేఖలో వేడుకున్నారు. ఈ లేఖ తన దృష్టికి రావడంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వెంటనే స్పందించారు. దీనిపై తక్షణం నివేదిక కావాలని, విచారణకు సంబంధించిన మొత్తం వివరాలు సమర్పించాలని అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు లేఖ రాశారు.