Wednesday, December 25, 2024

Harassment – ‘రా’ పేరుతో..రాక్ష‌స‌త్వం! కెనడా మహిళపై న‌కిలీ ఏజెంట్ అఘాయిత్యం

ప‌లుమార్లు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డ మోస‌గాడు
ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో ఘటన
టిండర్ యాప్‌ ద్వారా మహిళతో పరిచయం
డిన్నర్ కోసం హోటల్‌కు పిలిచి అత్యాచారం
ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం చెప్ప‌డంతో బెదిరింపులు
బాధితురాలి ఫిర్యాదుతో వెలుగులోకి వ‌చ్చిన ఘ‌ట‌న‌
నిందితుడి అరెస్ట్ చేసి విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, న్యూఢిల్లీ:

భారత గూఢచార సంస్థ (రా) ఏజెంట్‌గా చెప్పుకున్న ఓ జిమ్ ట్రైనర్ కెనడా మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఈ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. జిమ్ ట్రైనర్ అయిన సాహిల్ శర్మ డేటింగ్ యాప్‌లో పరిచయమైన కెనడా మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని ఆపై మోసం చేశాడు. బాధిత మహిళ కెనడా వెళ్లిపోయిన తర్వాత గర్భవతి అయ్యింది. ఈ విషయాన్ని చెప్పడంతో సాహిల్ ఆమెను బెదిరించాడు. యాప్‌లో ఆమెను బ్లాక్ చేస్తానని హెచ్చరించాడు. దీంతో ఈ విష‌యాన్ని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీఎన్ఎస్ (భార‌త న్యాయ సంహిత‌)లోని పలు సెక్షన్ల కింద సాహిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతడి స్నేహితులు ఇద్దరిపై కూడా కేసు నమోదైంది.

సాఫ్ట్ డ్రింక్‌లో మత్తుమందు కలిపి..

సాహిల్ తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తాను ఇండియాలో ఉన్నప్పుడు నిందితుడు ‘టిండర్’ యాప్‌లో పరిచయం అయినట్టు తెలిపింది. ఆ తర్వాత ఆమెను కలిసిన సాహిల్ మార్చి 20వ తేదీన డిన్నర్ కోసం ఓ హోటల్‌కు ఆహ్వానించాడ‌ని, హోటల్‌లో అప్పటికే సిద్ధం చేసిన సాఫ్ట్ డ్రింక్‌తోపాటు పిజ్జా తీసుకున్నట్టు తెలిపింది. అవి తీసుకున్న తర్వాత స్పృహ కోల్పోయానని, తెలివి వచ్చిన తర్వాత సాహిల్ తనపై అత్యాచారానికి పాల్పడినట్టు గుర్తించానని వివరించింది. దీనిపై ప్రశ్నిస్తే తాను ‘రా’ ఏజెంట్‌నని చెప్పాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, తాను ఏజెంట్‌ను కావడంతో ప్రస్తుతం ప్రమాదంలో ఉన్నానని, తాను రా ఏజెంట్‌నన్న విషయం ఎవరికీ చెప్పొద్దని తెలిపాడ‌ని పేర్కొంది.

- Advertisement -

భారత్‌కు రప్పించి మరీ అత్యాచారం..

ఆ తర్వాత బాధితురాలు కెనడా వెళ్లిపోయింది. అయితే, తన తల్లిని కలిసేందుకు రావాలని పిలవడంతో ఆగస్టులో ఆమె మళ్లీ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఢిల్లీ, ఆగ్రాలో నిందితుడు పలుమార్లు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పోలీసు అధికారిన‌ని అరిఫ్ అలీని పరిచయం చేశాడని, అతడు కూడా తనను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించింది. సాహిల్ తన జీవితాన్ని నాశనం చేశాడని, తనను ట్రాప్ చేశాడని ఫిర్యాదులో వాపోయింది. అతడితో సన్నిహితంగా ఉన్న ఫొటోలను డార్క్ వెబ్‌లో అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడని, ఇప్పుడు తాను డిప్రెషన్‌లో ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తును ముమ్మ‌రం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement