కరోనా సెకండ్ వేవ్‌లో చాలా మంది బాగానే ఉన్నట్లు కనిపించినా ఉన్నట్లుండి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు కరోనా కారణంగా వయో వృద్ధులు, శ్వాస కోశ సమస్యలు ఉన్న వారు మాత్రమే కరోనా వైరస్ ప్రభావానికి ప్రాణాలు కోల్పోయేవారు. కానీ సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ అప్పటివరకూ మామూలుగానే ఉండి ఒక్కసారిగా నష్టపరుస్తోంది. దీనికి కారణం హ్యాపీ హైపోక్సియా (happy hypoxia). దీని కారణంగా స్వల్పంగా వైరస్ లక్షణాలతో అప్పటివరకు చూడటానికి ఆరోగ్యంగా, చలాకీగా ఉన్నవారూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోతున్నారు.
హ్యాపీ హైపోక్సియా లక్షణం కారణంగా కరోనా రోగులతో పాటు మామూలు వ్యక్తులు కూడా అప్పుడప్పుడు తమ ఆక్సిజన్‌ను పల్స్ ఆక్సిమీటర్‌లో తనిఖీ చేయాలని నిపుణులు సూచించారు. హ్యాపీ హైపోక్సియాలో, పెదవుల రంగు మారడం ప్రారంభిస్తుంది. ఇది లేత నీలం రంగులోకి మారుతుంది. చర్మం కూడా ఎరుపు లేదా ఊదా రంగులోకి మారడం ప్రారంభిస్తుంది. వేడిలో లేకపోయినా, వ్యాయామం చేయకపోయినా చెమటలు పడతాయి. ఇవి రక్తంలో తక్కువ ఆక్సిజన్ లక్షణాలు. ఆక్సీమీటర్ ద్వారా లక్షణాల పర్యవేక్షణ అవసరమైతే వెంటనే ఆసుపత్రిలో చేరడానికి అవకాశం ఉంటుంది.
కొందరిలో అప్పటికి ఆక్సిజన్ శాతం సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ చూస్తుండగానే పడిపోతోంది. 72 గంటల్లో పరిస్థితి చేయిదాటిపోతోంది. కరోనా వల్ల ఇలా జరుగుతోంది. లోగడ ఆక్సిజన్ శాతం కాస్త తగ్గితే హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకోమనేవారు. ఇప్పుడు సీటీస్కాన్ పర్సంటేజీని బట్టి ఇంట్లో ఉండాలో, ఆసుపత్రిలో చేరాలో వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హ్యాపీహైపోక్సియా యువతలో ఎక్కువగా కనిపిస్తోంది. మరణాలూ వారిలో ఎక్కువ ఉంటున్నాయి.
హ్యాపీ హైపోక్సియాకు రెండు ప్రధాన కారణాలున్నాయని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. వైరస్ కలిగించే ఇన్‌ఫ్లమేషన్ రియాక్షన్ వల్ల ఊపిరితిత్తుల నుంచి రక్తం సరఫరా చేసే సన్నటి రక్తనాళాల్లోను గడ్డలు ఏర్పడుతున్నాయి. ఊపిరితిత్తులు దెబ్బతినడం, రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడటంతో ఆక్సిజన్ శోషించుకునే గుణం తగ్గుతోంది. మెదడుకు అవసరమైనంత రక్తం సరఫరా కాదు. బృహత్ ధమనికి పైన ఉండే కరోటిడ్ బాడీస్‌ను వైరస్ దెబ్బతీయడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిందని రోగి గ్రహించలేడు.
మరో కారణం.. రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు దాన్ని గాలి నుంచి ఎక్కువగా గ్రహించేందుకు మనిషి అసంకల్పితంగానే ఎక్కువసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఆ క్రమంలో రక్తంలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా బయటకు వెళ్లిపోతుంది. సాధారణంగా రక్తంలో కార్బన్ డై ఆక్సైడ్ 40 మిల్లీమోల్స్ ఉండాలి. మనిషి మెదడులో శ్వాసకోశ వ్యవస్థను నియంత్రించే భాగాన్ని స్టిమ్యులేట్ చేసేది Co2నే. ఉండాల్సిన దానికంటే తగ్గిపోవడం వల్ల, మనిషి మెదడులో స్టిమ్యులేషన్ జరగక ఆక్సిజన్ శాతం తగ్గిన విషయాన్ని రోగి గ్రహించలేడు.
హ్యాపీ హైపోక్సియా లక్షణాలు: కరోనా సోకినా జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. బాధితులమన్నదే తెలియకపోవచ్చు. టాయిలెట్‌కు వెళ్లినప్పుడు ఆయాసంగా అనిపించడం, పెదవులు నీలం రంగులోకి మారడం, చల్లటి వాతావరణంలోనూ చెమటలు పట్టడం వంటివి హ్యాపీ హైపోక్సియా లక్షణాలు. ప్రస్తుతం కరోనా ఉధృతంగా ఉన్నందున ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
ఈ వార్త కూడా చదవండి: కరోనా రాదని పేడ పూసుకుంటున్నారు.. కానీ ఇది చాలా ప్రమాదం