హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రని పోషించిన చిత్రం హ్యాపీ బర్త్ డే. ఈ చిత్రానికి దర్శకుడు రితేష్ రానా..ఈ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో చూద్దాం..
కథ విషయానికొస్తే.. పలు విమర్శల మధ్య ఆయుధ వినియోగ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిన కేంద్ర మంత్రి రితిక్ సోది (వెన్నెల కిషోర్ ) ప్రతిఫలంగా రష్యా ఆయుధ డీలర్ వ్లాదిమిర్ యురినిక్ నుంచి వేల కోట్ల రూపాయల భారీ మొత్తంలో డబ్బు ముడుపులు తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంటాడు. ఓ స్టార్ హోటల్ లోని లాకర్ లో ఆ డబ్బు దాచి పెట్టిన ఆయుధ డీలర్..ఆ లాకర్ పాస్ వర్డ్ ను ఓ పెన్ డ్రైవ్ లో పెట్టి రితిక్ సోదికి ఇవ్వాలనుకుంటాడు. భారీ మొత్తం చేతులు మారుతుందని తెలిసిన గుండా ( రాహుల్ రామకృష్ణ), హోటల్ వెయిటర్ లక్కీ (నరేష్ అగస్త్య)తో విదేశీయుడి నుంచి పెన్ డ్రైవ్ దొంగతనం చేయించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో ఆ పెన్ డ్రైవ్ హ్యాపీ (లావణ్య త్రిపాఠి) హ్యాండ్ బ్యాగ్ లోకి చేరుతుంది. మరోవైపు మిస్టర్ ఎక్స్ (గుండు సుదర్శన్), ఏ టూ జడ్ ఏ సర్వీస్ అయినా చేసే మ్యాక్స్ పెయిన్ (సత్య) చేత కేంద్ర మంత్రిని ఇబ్బందులు పెడుతుంటాడు. చివరకు హ్యాపీ హ్యాండ్ బ్యాగ్ లోని పెన్ డ్రైవ్ ఎవరికి దొరికింది. ఈ డబ్బు ఎవరు దక్కించుకున్నారు అనేది మిగిలిన కథ.
విశ్లేషణ .. ఆయుధాల వినియోగంపై కేంద్రమంత్రి రితిక్ సోది చర్చతో సినిమా ఇంట్రెస్టింగ్ మొదలవుతుంది. హ్యాపీ పాష్ పబ్ లోకి ఎంటర్ అవడం, ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు స్క్రీన్ ప్లే పరంగా ప్రయోగంగా నిలిచాయి. సినిమా చూస్తున్నంత సేపు ఒక కొత్త నేపథ్యాన్ని అనుభూతి చెందుతాం. పాత్రల ప్రవర్తన, వాటిని డిజైన్ చేసిన తీరు, అవి మాట్లాడే డైలాగ్స్, అనుగుణమైన నేపథ్య సంగీతం ఇవన్నీ హ్యాపీ బర్త్ డే సినిమాను ఒక కొత్త జానర్ లోకి తీసుకెళ్లాయి. దర్శకుడు ఈవీవీ స్టైల్లో నవ్వించే పేర్లతో వేసిన టైటిల్స్ మొదలు..సోషల్ మీడియాలో వచ్చే వైరల్ వీడియోలను వాడటం, ఆయుధ బిల్ పాసయినప్పుడు న్యూస్ ఛానెల్స్ చేసిన హడావుడి, ఇంగ్లీష్ టీవీ చర్చల్లో తెలుగు డబ్బింగ్…వీటిన్నింటితో దర్శకుడు నవ్వించే ప్రయత్నం చేశాడు.
నటీ నటులు .. జాతిరత్నాలు స్టైల్లో ప్రతి పాత్ర ద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా వీలైనంత నవ్వించే ప్రయత్నం చేసిన దర్శకుడు రితేష్ రానా…క్రియేటివ్ ఫ్రీడమ్ ను కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తీసుకున్నాడు. ఇంకో అడుగు ముందుకేసి బూతులూ వాడాడు. దాంతో పాత్రల ప్రవర్తన విచిత్రంగా అనిపిస్తుంటుంది. ఎంత ఫిక్షనల్ వరల్డ్ లో సినిమా నడిచినా, దానికో లాజిక్ అంటూ ఉంటుంది కదా. ఆ లాజిక్ వదిలిపెట్టి మ్యాజిక్ చేయాలనుకున్నాడు. లావణ్య త్రిపాఠికి సంబంధించి ఈ సినిమాలో ఓ సర్ ప్రైజ్ కూడా ఉంది. ఇలాంటి క్యారెక్టర్ ఆమెకు మళ్లీ దొరక్కపోవచ్చు. సత్య బాగా నవ్వించాడు, వెన్నెల కిషోర్ పాత్ర కూడా వినోదాన్ని పంచుతుంది. లక్కీ పాత్రలో నరేష్ అగస్త్య తన పరిధి మేరకు మెప్పించాడు. నేపథ్య సంగీతం సినిమాను ఫాలో అయ్యింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి. వెరైటీ సినిమా చూడాలనిపిస్తే హ్యాపీ బర్త్ డే ఒక ఆప్షన్.
టెక్నికల్స్ ..దర్శకుడుగా రితేష్ రానా ..రొటీన్ గా వెళ్లకుండా కొత్తగా ప్రయత్నించారు. అక్కడ దాకా ఆయన సక్సెస్. అయితే కాస్త తెలుగు ప్రేక్షకుడుని కూడా దృష్టిలో పెట్టుకుంటే అనవసరమైన కన్ఫూజన్ తప్పేది. డైరక్టర్ ఒకటి అనుకుంటే ప్రేక్షకుడు మరొకటి అనుకునే ప్రమాదాలే సినిమాలో అడుగడుక్కీ ఉన్నాయి. ఇక సంగీతం విషయానికి వస్తే…సినిమాకు కాలభైరవ ఇచ్చిన పాటలు అంత గొప్పగా లేవు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఫెరఫెక్ట్ గా సింక్ అయ్యింది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ చేయచ్చు. సినిమాటోగ్రఫీ డీసెంట్ గా ఉంది. సినిమాలో ఆర్ట్ వర్క్ మాత్రం అద్బుతంగా ఉంది. వాళ్లదే కష్టం. ప్రొడక్షన్ వాల్యూస్…బాగా చిన్న సినిమాకి బాగా ఖర్చుపెట్టారనిపించేలా ఉన్నాయి.