హనుమాన్ జయంతి సందర్భంగా రేపు (మంగళవారం) హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎక్కడెక్కడ ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి రూట్ మ్యాప్ నోటిఫికేషన్ విడుదల చేశారు. హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో వాహనదారులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు సూచించిన మార్గాల్లోనే వెళ్లాలని తెలిపారు.
హనుమాన్ శోభాయాత్ర గౌలిగూడ రామమందిరం నుండి ప్రారంభమై సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ మందిర్ వరకు సాగుతుంది. రేపు ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. కూడళ్లలో 44 డైవర్షన్ పాయింట్లు ఉన్నాయి. అదేవిధంగా హైదరాబాద్ నగర పరిధిలో మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 24వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయి.