Tuesday, November 26, 2024

రూ.5,036 కోట్లతో హంద్రీ- నీవా, గాలేరు-నగరి అనుసంధానం పనులు.. 90శాతం పూర్తై న ప్ర‌ధాన కాలువ ప‌నులు..

అన్నమయ్య , ప్రభన్యూస్‌ : కరువు ప్రాంతంగా పేరుగాంచిన ప్రస్తుత అన్నమయ్య జిల్లాను కృష్ణా, గండికోట జలాలతో సాగు , తాగునీటిని అందించి సస్యశ్యామలం చేసేందుకు ఆనాటి ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. మొదట 2007లో పనులు ప్రారంభించి శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి 216 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీడిపల్లి రిజర్వాయర్‌ కు హంద్రీనీవా కాలువతో అనుసంధానం చేసే పనులు రూ. 5,036 కోట్లతో ఇటీవల ప్రారంభమయ్యాయి. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి 511 కిలోమీటర్లు దూరం హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ ఏర్పాటు చేసేందుకు 2007 నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.14190 కోట్లు పలు దఫాలుగా ఖర్చు చేశారు. దాని ఫలితంగా నేటికీ 90 శాతం హంద్రీనీవా కాలువ పనులు పూర్తయ్యాయి. హంద్రీ- నీవా కాలువ ఏర్పాటు కోసం 2007లో ఫేస్‌ – 1 కింద రూ. 2,774 కోట్లు, ఫేస్‌ – 2 కింద రూ. 4,076 కోట్లు, 2016లో రివైజ్డ్‌ పనుల కింద రూ.7,340 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బిల్లులు రూ.340.16 కోట్ల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

పది శాతంపైగా పనులు పెండింగ్‌..

హంద్రీ-నీవా సుజల స్రవంతి కాలువ పనులు ఇప్పటికి పది శాతం పైగానే పెండింగ్‌ ఉన్నాయి. అనంతపురం జిల్లాలో రెండు చోట్ల, అన్నమయ్య జిల్లాలో కలకడ వద్ద రెండు చోట్ల మేజర్‌ వంతెనల నిర్మాణాలు జరగాల్సి ఉంది . వీటితో పాటు చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామం దగ్గర 200 మీటర్ల దూరం భూ సేకరణ జరగకపోవడంతో పనులు పెండింగ్‌ ఉన్నాయి. భూసేకరణ చేసి ఆ 200 మీటర్ల దూరంలో కాలువ ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో అదే గ్రామం సమీపంలోని కలిబండ వద్ద భూగర్భ సొరంగంలో కాలువలు ఏర్పాటు చేయడం, అది విఫలం కావడంతో మళ్ళీ పక్కనే లిప్ట్ ఏర్పాటు పనులు చేపట్టి ఇటీ వలే పూర్తి చేశారు. లిప్టింగ్‌ కు అవసరమైన సామాగ్రిని సిద్ధం చేసి ఉంచారు. కలకడ సమీపంలోని హంద్రీనీవా మెయిన్‌ కెనాల్‌ పనులకు అవసరమైన మరో ఆరు ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉంది. భూసేకరణ పూర్తయిన వెంటనే ఆ పనులు కూడా చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అనంతపురం తలపుల వద్ద పెండింగ్లో ఉన్న టన్నల్‌ పనులు కూడా ఇటీవల పూర్తి చేశారు. ప్రస్తుతం 14వ ప్యాకేజ్‌ ద్వారా అనంతపురంలో, అన్నమయ్య జిల్లాలో పెండింగ్‌ పనులు కొనసాగుతున్నాయి.

పుంగనూరు కాలువల విస్తరణకు రూ.1929 కోట్లకు ప్రతిపాదనలు..

అడవిపల్లి రిజర్వాయర్‌ నుంచి వెళుతున్న పుంగునూరు కాలువ నిర్మాణ విస్తరణ కోసం నూతనంగా రూ.1929 కోట్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ ప్రతిపాదనలకం పరిపాలన అనుమతులు రాగా, రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు అవసరమైన ప్రణాళికలు అధికారులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

హంద్రీనీవా సుజల స్రవంతి పూర్తయితే జిల్లాకు 13 టిఎంసిల నీరు వచ్చే అవకాశం..

హంద్రీ-నీవా సుజల స్రవంతి గాలేరు-నగరి అనుసంధానం చేయడం, హంద్రీనీవా కాలువ పనులు పూర్తయితే అన్నమయ్య జిల్లాకు 13 టిఎంసిల నీరు వచ్చే అవకాశం ఉంది . ఈ నీటిని జిల్లాలో తాగు, సాగునీరుగా ఉపయోగించుకుని జిల్లా సస్యశ్యామలం కావడానికి, ప్రజల దాహార్తి తీర్చడానికి ఎంతో అవకాశం ఉంది. శ్రీశైలం నుంచి కృష్ణా జలాలు, గండికోట నుంచి గాలేరు నగరి ద్వారా వెలిగల్లు జలాయానికి 4.5 టీఎంసీల నీరు వస్తుంది. వెలిగల్లు ద్వారా గాలివీడు, రాయచోటి పట్టణాలకు తాగునీరు, ఇతర మండలాలకు సాగునీరు అందుతుంది. 1.6 టి.ఎం.సి.ల నీరు చెర్లోపల్లి రిజర్వాయర్‌కు, చిన్నమండెం మండలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్‌ కు 1.02 టీఎంసీల నీరు రావడం, తద్వారా ఆ ప్రాజెక్టు కింద ఉన్న 28 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు జలాలు అందుతాయి. అలాగే అడవి పల్లి రిజర్వాయర్‌ 1.80 టీఎంసీల నీరు రావడం , దానిద్వారా నీవా, వాయల్పాడు డిస్ట్రిబ్య్రూటర్లకు సాగు జలాలు అందడం జరుగుతుంది. అలాగే పుంగునూరు కాలువలకు సాగు, తాగునీరు వెళుతుంది . దీంతో పాటు మదనపల్లి సమీపంలోని చిప్పిలి సమ్మర్‌ స్టోరేజ్‌ కు 51ఎంసీఎఫ్‌టి ల తాగునీరు, గుంటివారిపల్లె సమ్మర్‌ స్టోరేజ్‌ కు 131 ఎంసీఎఫ్‌ టిల తాగునీటి సరఫరా అవుతుంది. తద్వారా ఎటు-వంటి కాలంలోనైనా మదనపల్లె పట్టణానికి తాగునీటి సమస్య తలెత్తే అవకాశం లేకుండా పోతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement