Tuesday, November 26, 2024

హంబన్‌టోట, వివాదాల పుట్ట.. శ్రీలంక పోర్టుపై అందరి దృష్టి

శ్రీలంకలోని కీలకమైన హంబన్‌టోట నౌకాశ్రయం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువైంది. భారత్‌కు అతి సమీపంలోని ఈ పోర్టులో చైనా నిఘానౌక లంగరు వేసేందుకు వస్తూండటంతో తాజా వివాదం తలెత్తింది. భారత్‌పై నిఘాకోసం చైనా ఈ చర్యకు పాల్పడుతున్నట్లు భారత్‌ ఆరోపిస్తోంది. ఎల్‌ఏసీ వద్ద ఇప్పటికే భారత్‌తో ఘర్షణలకు దిగుతున్న చైనా ఇప్పుడు శ్రీలంక తీరంలో మోహరించి భారత్‌కు తలనొప్పిగా మారుతోంది. చైనానుంచి భారీగా రుణాలు తీసుకున్న మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తిరిగి చెల్లించలేక చేతులెత్తేశారు. ఫలితంగా హంబన్‌టోట పోర్టును చైనాకు 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది. పోర్టు నిర్వహణ, అభివృద్ధి కోసం చైనా రుణాలిచ్చిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం యువాన్‌ వాంగ్‌-5 అనే నిఘానౌకను అక్కడికి చైనా తరలిస్తోంది. చైనా తీరం నుంచి ఇప్పటికే ఆ నౌక బయలుదేరినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నౌక ద్వారా చైనా ంండు పనులు చేస్తుంది. ఒకటి నిఘా. రెండోది రీసెర్చ్‌ అండ్‌ సర్వే. అంతరిక్షంలోను, ఉపగ్రహాల కదలికలపైన, ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణుల ప్రయోగం వంటి పరిణామాలపైన ఇది కన్నేసి ఉంచుతుంది. ఇది భారత్‌కు ప్రమాదకరం. అందువల్ల శ్రీలంక ప్రభుత్వానికి తమ అభ్యంతరాలను భారత ప్రభుత్వం తెలియజేసింది. కాగా తమ నౌకను హంబంటోట నౌకాశ్రయానికి పంపుతున్నట్లు చైనా సమాచారమిచ్చిందని శ్రీలంక రక్షణశాఖ ప్రతినిధి నళిన్‌ హెరాత్‌ తెలిపారు. అయితే ఈ విషయంలో భారత్‌ అభిప్రాయాలను, ఆందోళనలను పరిగణనలోకి తీసుకోగలమని చెప్పారు.

11నాటికి శ్రీలంకకు చైనా నౌక..

చైనా నుంచి బయలుదేరిన యువాన్‌ వాంగ్‌ 5 నిఘానౌక ఆగస్టు 11నాటికి హంబంటోట నౌకాశ్రయానికి చేరుకోనుంది. ఈ నౌక చైనా సైన్యం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ పరిధిలో పనిచేస్తుంది. సైన్యంలోని వ్యూహాత్మక మద్దతు (స్ట్రాటజిక్‌ సపోర్ట్‌ ఫోర్స్‌) యూనిట్‌ దీనికి మార్గదర్శనం చేస్తుంది. సాధారణంగా ఈ యూనిట్‌ స్పేస్‌, సైబర్‌, ఎలక్ట్రానిక్‌ యుద్ధరీతులపై దృష్టి సారిస్తుంది. యువాన్‌ వాంగ్‌ 5 నౌక ఆగస్టు 17న తిరిగి చైనాకు వెడుతుందని బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌కు సంబంధించిన శ్రీలంక సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

భారత్‌ ఆందోళన ఎందుకంటే..

వారంపాటు శ్రీలంక తీరంలో లంగరువేసిన సమయంలో చైనా నౌక భారత్‌ పరిధిలోని హిందూ మహాసముద్రంలోని వాయువ్య ప్రాంతంలో కన్నేసిఉంచుంతుంది. అంతరిక్షంలో భారత ఉపగ్రహాల కదలికలను గమనిస్తుంది. మన కార్యకలాపాలను విశ్లేషిస్తుంది. ఇది భారత్‌కు ఆందోళన కలిగిస్తోంది.2007లో నిర్మించిన ఈ నిఘానౌక 11వేల టన్నుల సామర్థ్యంతో ఉంది.
చైనాలోని జియాన్‌జియిన్‌ తీరం నుంచి జులై 13న బయలుదేరిన ఈ నౌక ప్రస్తుతం తైవాన్‌ సమీపంలో ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement