మోడల్‌కు తప్పుడు హెయిర్ కట్ చేసినందుకు రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని లగ్జరీ హోటల్స్ చైన్ ఐటీసీని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (ఎన్‌సీడీఆర్‌సీ) ఆదేశించింది. ఆమె జుట్టును పూర్తిగా తొలగించడమే కాకుండా.. వైద్యం అందించే విషయంలోనూ నిర్లక్ష్యం వహించినందుకు ఈ తీర్పునిచ్చింది. ఎనిమిది వారాల్లోగా బాధితురాలికి పరిహారం చెల్లించాలని ఐటీసీని గ్రూపును ఎన్‌సీడీఆర్‌సీ ఆదేశించింది.
న్యూఢిల్లీలో ఒక ఇంటర్వ్యూకు హాజరు అయ్యే క్రమంలో ఆష్ణారాయ్ అనే మోడల్ 2018 ఏప్రిల్ 12న సాధారణ హెయిర్‌కట్ కోసం ఐటీసీ మౌర్యలోని సెలూన్‌ను సందర్శించింది. అయితే మోడల్ అడిగిన విధంగా కాకుండా.. సిబ్బంది మొత్తం జుట్టును కత్తిరించారు. దీంతో ఆమె మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు. దీంత ఆమెకు పరిహారంగా తిరిగి ఆ జుట్టును అందించే చికిత్సను అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కానీ చికిత్స ఇచ్చే క్రమంలో అధిక అమ్మోనియా కారణంగా ఆమె జుట్టు, నెత్తి పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో తనకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయ్యారనే కారణంతో బాధితురాలు ఎన్‌సీడీఆర్‌సీకి ఫిర్యాదు చేసింది.
మరోవైపు మోడల్ ఇచ్చిన ఫిర్యాదును తొలుత తప్పుదోవ పట్టించేందుకు హోటల్ యాజమాన్యం ప్రయత్నించింది. ఆమె హెయిర్ కట్ చేసుకున్నప్పుడున్న ఉన్న మేనేజర్ ఇప్పుడు లేరని, అతను ఇచ్చిన మాట గురించి తమకు తెలియదని బుకాయించబోయింది. అయితే గతంలో మేనేజర్, మోడల్ మధ్య జరిగిన వాట్సాప్ సంభాషణల్లో .. హోటల్ యాజమాన్యం తప్పును ఒప్పుకుని చికిత్సను అందించేందుకు ఒప్పుకోవడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని రూ. 2 కోట్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.