న్యూఢిల్లి: ఢిల్లి లోని పలు ప్రాంతాలలో సోమవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వడగళ్ల వాన వచ్చింది. వడగళ్లు పడి అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించింది. దీంతో ప్రయాణికులు అనేక అవస్థలకు గురయ్యారు. చరిత్రాత్మకమైన జమా మసీద్ గుమ్మటం ఈ వర్షాలకు దెబ్బతిన్నదని షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారి తెలియజేశారు. గుమ్మటానికి, మినార్‌లకు కూడా నష్టం జరిగినట్లు తెలియజేశారు. గుమ్మటానికి సంబంధించిన కొంతభాగం కిందపడడంతో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందనీ, ఈ విషయమై ప్రధానికి ఓ లేఖ రాస్తానని వివరించారు. అదేవిధంగా విమానాల రాకపోకలపైనా ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది.
ఫ్లయిట్ ట్రాకింగ్ వెబ్‌సైట్‌ను చూస్తే… ఇందిరా గాంధీ విమానశ్రయంపై అనేక విమానాలు చక్కెర్లు కొట్టడం కనిపించింది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ల్యాండింగ్‌కు అనుమతించకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలిసంది. విమానాల రాకపోకలకు ఉరుములు మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర అంతరాయం కలిగించిందని విమానాశ్రయం అధికారులు తెలియజేశారు. గడిచిన కొద్ది వారాలనుంచి ఢిల్లిd నగరం నిప్పుల కుంపటిని తలపిస్తున్నది. వడగాలు, అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడిపోయారు. హఠాత్తు సాయంత్రం 4.30 గంటలకు ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా గాలివాన మొదలైంది. అనేక ప్రాంతాలలో వడగళ్లు కూడా కురిసాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..