నిజామాబాద్, ప్రభ న్యూస్ : బిచ్కుంద ప్రాంతంలో శనివారం రాత్రి వడగళ్ల వాన కురిసింది. దీంతో తాము పండించిన వరి పంట నాశనమైపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏటా ఏప్రిల్, మే నెలల్లో ప్రకృతి వైపరీత్యాలతో వరి, మామిడి పంటలు తీవ్రంగా నష్టపోతున్నాయి. దీంతో ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు రైతులు ముందస్తుగా వరి పంటను సాగు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంమంలో బోధన్, వర్ని, కోటగిరి, ఎడపల్లి మండలాల్లో రైతులు ముందస్తుగా వరి పంటను సాగు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో వరి కోతలు ప్రారంభమయ్యాయి.
అయితే మార్చి నెలలోనే రాళ్ల వర్షం కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. డిసెంబరు, జనవరిలో వరి నాట్లు వేయాల్సి ఉండగా, ప్రకృతి వైపరీత్యాలను నివారించేందుకు ఈ ప్రాంతంలో నవంబర్‌లో వరి నాట్లు వేశారు. అయితే ప్రకృతి విధ్వంసంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మామిడి తోటలకు తీరనీ నష్టం
శనివారం కురిసిన వడగళ్ల వానతో మామిడి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏడాదికి ఒక పంట మాత్రమే పండే మామిడి, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో రాళ్ల వర్షం, ఈదురు గాలుల వల్ల మామిడి పంటకు ఏటా తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అయితే మార్చిలోనే వడ గళ్ళ వర్షం పడుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు.