ముంబయి పేలుళ్ల సూత్రధారి, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్‌ను పేరును మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ‘తల్హా సయీద్ ఉగ్ర కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని మేం విశ్వసిస్తున్నాం. అందుకే, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం, 1967 కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నాం” అని కేంద్ర హోంశాఖ తెలిపింది.
భారత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్హా 32వ వ్యక్తి. ఇదే జాబితాలో హఫీజ్ సయీద్ పేరు కూడా ఉంది. 46ఏళ్ల తల్హా సయీద్ పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించాడు. తండ్రి స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియన్ నాయకుడైన తల్హా.. ఈ సంస్థ క్లెరిక్ విభాగానికి హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. భారత్, ఆఫ్గనిస్థాన్‌లో లష్కరే తోయిబా నియామకాలు, నిధుల సేకరణ, దాడులకు కుట్ర రచించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..