హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ లోక్ సభ సభ్యుడు, ఎఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతుంది. హ్యాకింగ్‌కు గురవుతున్నట్లు యాపిల్ జారీ చేసిన థ్రెట్ వార్నింగ్ స్క్రీన్ షాట్‌ను ఆయన ప్రసారమాద్యమాల్లో విడుదల చేశారు. యాపిల్ హెచ్చరికను విడుదల చేసిన ఆయన హ్యాకర్స్ తన ఫోన్‌ను మంగళవారం రాత్రి నుంచి ట్య్రాక్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఖూబ్ పర్దా హై కి చిల్మన్‌సె లగె బైఠే హైన్, సాఫ్ ఛుప్తేభీ నహీన్, సామ్నె ఆతేభి నహీన్, అనే ఫార్సీ కొటేషన్‌ను జోడించి, ఆయన యాపిల్ హెచ్చరిక స్క్రీన్ షాట్‌తో ట్వీట్ చేశారు. ఇద్దరు ప్రేమికుల మధ్య పరదా ఉన్నా, పక్కనే హత్తుకుని కూర్చున్నారు, పారదర్శకంగా దాక్కోవడమూ లేదూ, ముందుకు రావడమూ లేదూ అని దానర్థం. ఎన్నికల వేడి వాతావరణంలో గరం గరంగా ఉన్న ప్రజలు సరదాగా ఈ ట్వీట్‌తో ఆనందించడం కనిపించింది. ”
ఇక అసదుద్దీన్ తో పాటు.. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని కొందరు ప్రతిపక్ష ఎంపీలు కూడా ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్ మెసేజ్‌లు వచ్చినట్లు ఆ ఎంపీలు పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు చెందిన పార్టీ నేతలు ఇవాళ ఆ ఆరోపణలు చేశారు. తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా, కాంగ్రెస్ నేత ప్రియాంకా చతుర్వేది, శశి థరూర్, పవన్ ఖేరా, ఆప్ ఎంపీ రాఘవ చద్దా… తమ ఫోన్లు హ్యాక్ అవుతున్నట్లు తెలిపారు.