సీఎం కేసీఆర్ ని ప్రశ్నించేందుకే తెలంగాణలో పార్టీ పెడుతున్నానని ప్రకటించిన షర్మిలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర పాలనలో తెలంగాణ ప్రజలు దోపిడీకి గురయ్యారని…. ఇంకా దుర్బుద్ధితో కొత్త, కొత్త పార్టీలు ఆవిర్భావిస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయని… పోతిరెడ్డిపాడు, సంగమేశ్వర ప్రాజెక్టు ద్వారా నీటి దోపిడీ చేసింది ఎవరు ? అని షర్మిలను నిలదీశారు. మళ్లీ తెలంగాణ ప్రజల మధ్య బేధాభిప్రాయాలు, అలజడి సృష్టించాలనే మీ పన్నాగాలు ఇక పారవని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు తెలివి ఉన్నవాళ్లని.. మీ కుట్రలు కుతంత్రాలు తిప్పి కొడతారని హెచ్చరించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, వివిధ వ్యవసాయ పథకాల అవసరాల కోసం 15 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రమే అభివృద్ధిలో ముందు ఉందని గుర్తు చేశారు. మతాలు, ప్రాంతాలు, కులాల పేరుతో చిచ్చు పెట్టే వారికి బుద్ది చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఇక, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్ అని… పెయింటింగ్ పని చేసుకునే వాడు ఈరోజు రేంజ్ రోవర్ కారులో తిరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. నల్లగొండ జిల్లా ప్రజలకు గుత్తా గురించి బాగా తెలుసని…తనకు మీ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు.