తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాదాపు ఖాయం అయిపోయారు. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం. మండలి చైర్మెన్ ఎన్నిక ప్రక్రియకు సంబంధించిన అనుమతుల కోసం ఈ రోజు గవర్నర్ సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. నేడు మండలి చైర్మెన్ ఎన్నికకు గవర్నర్ అనుమతి లభించగానే.. ఈ రోజే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 12న చైర్మెన్ ఎన్నిక కోసం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. శాసన మండలిలో టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఈ ఎన్నిక దాదాపు ఎకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ గా బండా ప్రకాశ్ పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి గతంలోనూ మండలి చైర్మన్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే.