Wednesday, November 20, 2024

‘సివిల్స్’ కోసం గురుకుల శిక్షణ.. జనవరి నుంచి మెరిట్ ఆధారంగా ప్రవేశాలు

ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : సివిల్ సర్వీసులకు వెళ్లాలనుకునే యువకుల కోసం ప్రత్యేకంగా ఒక గురుకుల శిక్షణా కేంద్రాన్ని గుంటూరు జిల్లాలో ప్రారంభించనున్నారు. జనవరి నుంచి ఈ కేంద్రం పనిచేయనారంభిస్తుంది. ఈ కేంద్రంలో కేవలం మెరిట్ ఆధారంగానే ప్రవేశాలుంటాయని నిర్వాహకులు వెల్లడించారు. గుంటూరు జిల్లాలోని తెనాలికి 13 కిలోమీటర్ల దూరంలో శేకూరు గ్రామంలో ఐఏఎస్ గురుకుల విద్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు ఐఆర్ఎస్ అధికారి పి. శివ అచ్చయ్య అన్నారు. తెనాలిలోని కుమార్ పంప్స్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొమ్మిదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన బాల బాలికలకు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, సివిల్ సర్వీసులకు ఎంపిక చేసేందుకు తాము గురుకుల విద్యాలయాన్ని జనవరి నుండి ప్రారంభిస్తున్నామని, సిఫారసులు,రికమండేషన్ లు ఏమీ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేసుకుంటామన్నారు.

9,10 ,ఇంటర్మీడియట్, డిగ్రీ తమ వద్దే పూర్తి చేసేవిధంగా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ విద్య పూర్తయ్యాక చివరి సంవత్సరం ఐఏఎస్ సంవత్సరంగా తాము పరిగణలోకి తీసుకున్నామని, మొత్తం ఎనిమిదేళ్ల కాలంలో సివిల్ సర్వీస్ కు ఎంపిక అయ్యేవిధంగా విద్యార్థులను తీర్చిదిద్దామన్నారు. తమ వద్ద చేర గోరే విద్యార్థులు కేవలం శాఖాహారం తీసుకోవాలని, సెల్ ఫోన్లు అంగీకరించబడవని, అత్యవసర సమయాల్లో ఒకటి రెండు రోజులు మినహా సెలవులు మాత్రమే ఇస్తామని అంతకుమించి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. భారతదేశంలో ఇప్పటివరకు ఒకే వివేకానందుడు ఉన్నారని, తమ ప్రయత్నంలో సివిల్ సర్వీసుకు ఎంపికైన ప్రతి ఒక్కరూ వివేకానందుడు అవుతాడన్నారు.

- Advertisement -

తన 39 ఏళ్ల అనుభవంలో సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మహా యజ్ఞం తలపెట్టామన్నారు. దీనిని ఛాలెంజ్ గా తీసుకొని ముందుకు వెళుతున్నామని, ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. కుమార్ పంప్స్ అధినేత కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు శేకూరులో రెండెకరాల స్థలం ఏర్పాటు చేయడం జరిగిందని, తెనాలి ప్రాంత వాసులు గర్వంగా చెప్పుకునేందుకు తాను ముందుకు రావడం జరిగిందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇందులో చేరగోరే ప్రతి ఒక్కరూ దేశ సౌభాగ్యానికి దోహద పడతారని ఆశిస్తున్నానని అన్నారు. సమావేశంలో కె. హరికుమార్. తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంపై రూపొందించిన బ్రోచర్ ను వారు ఆవిష్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement