ప్రపంచ యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత యువ వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. బాలుర విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాకు గురునాయుడు సనపతి(16) స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా నిలిచాడు. బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య ఎస్ డాల్వి కాంస్యం చేజిక్కించుకుంది. మెక్సికోలో జరుగుతున్న ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో భాగంగా ఆదివారం జరిగిన బాలుర 55కేజీల విభాగంలో గురునాయుడు సనపతి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మొత్తం 230 కేజీల బరువు ఎత్తి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. సౌదీ అరేబియాకు చెందిన అలీ మజీద్ 229 కేజీలతో రెండో స్థానంలో నిలవగా, కజకిస్తాన్‌కు చెందిన ఉమ్రోవ్ 224 కేజీలతో మూడో స్థానంలో నిలిచాడు.
మరోవైపు బాలికల 45 కేజీల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సౌమ్య ఎస్ డాల్వి 148 కేజీల బరువు ఎత్తి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన జె. రామోస్ 155 కేజీల బరువుతో తొలి స్థానం సాధించగా వెనిజులాకు చెందిన మాంటిల్లా 153 కేజీలతో రెండో స్థానంలో నిలిచింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.