దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు టీకాలు వేయించుకోవడాన్ని ప్రోత్సహించేందుకు పలు సంస్థలు ఉచిత ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని గుర్గావ్‌కు చెందిన ఒక రెస్టారెంట్ తాజాగా మందు బాబులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. ‘కరోనా టీకా వేయించుకోండి.. ఉచితంగా బీర్ పట్టుకెళ్లండి’ అని ప్రకటించింది. అలాగే టీకాలు వేయించుకునేలా ఎక్కువ మందిని ప్రోత్సహించడానికి ‘ఇండియన్ గ్రిల్ రూమ్‌తో మీ టీకాను జరుపుకోండి’ అనే కొత్త ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. వ్యాక్సిన్ తీసుకున్న కార్డును చూపితే ఉచితంగా బీర్ సర్వ్ చేస్తామని పేర్కొంది. ఈ నెల 5న ప్రారంభమైన ఈ ఆఫర్ ఈ వారం వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
గుజరాత్ రాజ్‌కోట్ జిల్లాకు చెందిన స్వర్ణకారుల వర్గానికి చెందినవారు ఇటీవల కరోనా టీకా వేయించుకున్న మహిళలకు ముక్కు పుడకలు, పురుషులకు చేతి కడియాలు పంపిణీ చేశారు. అలాగే అదే జిల్లాకు చెందిన జాన్ విజన్ సంస్థ టీకా వేయించుకున్న వారికి ఉచితంగా ఆహారాన్ని అందజేస్తోంది. టీకా వేయించుకునే వారి కోసం అల్పాహారం, లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. దీంతో టీకా కోసం సమయం వెచ్చించే వారు ఇంటికి వెళ్లిన తర్వాత వండుకునే బాధ తప్పుతుందన్నారు.