Wednesday, September 25, 2024

Gun Fire – నిన్న ట్రంప్ .. నేడు కమలా హ్యారిస్

దూసుకెళ్లిన బుల్లెట్స్
క‌మ‌లా హ్య‌రిస్ కార్యాల‌యంపై కాల్పులు

న్యూ యార్క్ – అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ కాల్పుల ఉదంతాలు ఒకదాని వెంట ఒకటిగా చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై రెండుసార్లు కాల్పులు జరిగాయి. తృటిలో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

ఇప్పుడు తాజాగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ సైతం ఇలాంటి పరిణామాన్ని ఎదుర్కొనాల్సి వచ్చింది. అరిజోనాలో గల ఆమె ఎన్నికల ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అమెరికా కాలమానం ప్రకారం గ‌త‌ అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఘటన చోటు చేసుకుంది. అరిజోనా టెంపె సమీపంలోని సదరన్ అవెన్యూ- ప్రీస్ట్ డ్రైవ్ ప్రాంతంలో ఉంటుంది కమలా హ్యారిస్ ఎన్నికల కార్యాలయం. అరిజోనా స్టేట్‌కు సంబంధించిన కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి సాగుతుంటాయి. ఎన్నికల ర్యాలీలు, డిబేట్లకు సంబంధించిన పనులన్నింటినీ కూడా ఆమె టీమ్ ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తుంటుంది.

- Advertisement -

అర్ధరాత్రి దాటిన తరువాత ఈ ఆఫీస్‌పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ సమయంలో కమలా హ్యారిస్ గానీ, ఇతర సిబ్బంది గానీ అక్కడ లేరు. బుల్లెట్లు తగిలి ఆఫీస్ కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కొంతమేర ఫర్నిచర్ ధ్వంసమైంది. కాల్పుల వల్లే అవి డ్యామేజ్ అయ్యాయి.

గ‌తంలోనూ కాల్పులు ….

ఈ సమాచారం అందుకున్న వెంటనే టెంపె పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. కమలా హ్యారిస్ కార్యాలయంపై కాల్పులు జరిగిన విషయాన్ని ధృవీకరించారు. బుల్లెట్ల వల్ల అక్కడ డ్యామేజ్ జరిగిందని టెంపె పోలీస్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ సార్జంట్ ర్యాన్ కుక్ తెలిపారు. కిందటి వారం కూడా ఇదే అరిజోనా ఆఫీస్‌పై దుండగులు కాల్పులు జ‌రిపారు. అప్పట్లో వాళ్లు బాల్ బేరింగ్/బుల్లెట్ బాల్ గన్‌ను ఉపయోగించారు. ఇప్పుడు మరోసారి కాల్పులకు తెగబడ్డారు. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు డెమొక్రటిక్ పార్టీ అరిజోనా స్టేట్ కోఆర్డినేటర్ సీన్ మెక్‌ఎనెర్నీ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement