గాంధీనగర్ – బిపోర్‌జాయ్ తుపాను క్రమక్రమంగా గుజరాత్ ను సమీపిస్తున్న కొద్ది దాని ఉదృతి పెరిగిపోతున్నది.. తీరం దాటే సమయంలో తీవ్ర విధ్వంసం సృష్టించే సామర్థ్యం దీనికి ఉందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.. గుజరాత్‌లోని జఖౌ తీరంలో గురువారం సాయంత్రం ఈ తుపాను తీరం దాటనున్న నేపథ్యంలో ఇప్పటికే గుజరాత్ తీరప్రాంతం చిగురుటాకుల వణికిపోతున్నది.. ద్వారకలో బలమైన గాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో పెద్ద ఎత్తున్న అలలు ఎగిసిపడుతున్నాయి. పోరుబందర్‌తో పాటు ద్వారక జిల్లాల్లో గాలి వేగం పుంజుకుంటున్నది… ఆ జిల్లాల్లో గాలి వేగం గంటకు 75 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నది… గుజరాత్‌లోని కచ్ ప్రాంతంతో పాటు పాకిస్థాన్‌లోని కరాచీ తీర ప్రాంతం మధ్య బిపర్‌జాయ్ తుఫాన్ గురువారం తీరం దాటే అవకాశాలు ఉండటంతో తీరం వెంట ఉన్న సుమారు 8 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఆ సమయంలో ద్వారక, జామ్‌నగర్, కచ్, మోర్బీ తదితర జిల్లాలో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేశారు. తీరం దాటే సమయంలో గంటకు 125-135 కి.మీలు వేగంతో, ఆ తర్వాత 145-150 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపారు. కచ్, జామ్‌నగర్, మోర్బీ, గిర్ సోమనాథ్, పోరుబందర్, ద్వారక జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండనున్నది. ఆ జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉంది. గాలి వేగం కూడా శక్తివంతంగా మారే ఛాన్సు ఉన్నట్లు తెలిపారు. జూన్ 15వ తేదీన దాదాపు 150 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఆ ఈదురుగాలుల వల్ల నష్టం భారీ స్థాయిలో ఉండే ఛాన్సు ఉందని ఐఎండీ డైరెక్టర్ తెలిపారు. దీంతో అధికార యంత్రంగం అప్రమత్తమైంది.. ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.. త్రివిధ దళాలలను రక్షణ కోసం సిద్దం చేశారు.. ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు గుజరాత్ తీరం వెంబడి మోహరించారు.. నావికాదళంతో పాటు కోస్ట్ గార్డు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.. విద్యుత్, టెలిఫోన్, సెల్,ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయి..