న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఈసారి కూడా గుజరాత్‌లో బీజేపీ విజయ ఢంకా మోగించబోతోందని, హిమాచల్‌ప్రదేశ్‌లో మాత్రం నువ్వా నేనా అన్న పరిస్థితి నెలకొందని పీపుల్స్ పల్స్ సంస్థ ప్రతినిధి, మాజీ సమాచార కమిషనర్ దిలీప్ రెడ్డి వెల్లడించారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో సోమవారం పీపుల్స్ పల్స్ సంస్థ అధినేత రవిచంద్, సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దిలీప్ మాట్లాడుతూ… పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం గుజరాత్‌లో బీజేపీకి 125-143, కాంగ్రెస్‌కు 30-48, ఆమ్ ఆద్మీ పార్టీకి 3-7, ఇతరులకు 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. బీజేపీ-కాంగ్రెస్ మధ్య ఓట్ల వ్యత్యాసం 21 శాతంగా ఉందని అన్నారు. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 25 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 16 శాతం, ఇతరులకు 13 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందన్న ఆయన, 182 స్థానాలున్న గుజరాత్ శాసనసభలో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 92 సీట్లు గెలవాలని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రం అయినందున, ఎప్పటిలాగే ఆయన సెంటిమెంట్ బీజేపీకి లాభం చేకూర్చిందని, ఈసారి గుజరాత్‌లో దాదాపు 30 బహిరంగ సభల్లో ప్రధాని పాల్గొనడం, వరుసగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అమిత్ షా క్షేత్రస్థాయిలో ఉండి వ్యుహాలు రచించడం వల్ల గుజరాత్‌లో బీజేపీ తన పట్టు నిలుపుకోగలిగిందని దిలీప్ రెడ్డి వివరించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ 16 శాతం ఓట్లు సాధించినా, సీట్లు సాధించడంలో విఫలమైందన్నారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓటు శాతం 3.1 శాతం తగ్గిందని, కాంగ్రెస్ ఓటు శాతం 16.4 శాతం తగ్గిందని చెప్పారు. హార్థిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్‌ను పార్టీలో చేర్చుకోవడం బీజేపీకి బలం చేకూర్చిందని పీపుల్స్ పల్స్ అభిప్రాయపడింది. నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, పంటలకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి వంటివి గుజరాత్‌లో ప్రధాన సమస్యలని పీపుల్స్‌పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడైందన్నారు. రైతులు, సామాన్యులు బీజేపీపై అసంతృప్తితో ఉన్నా వారికి వేరే ప్రత్యామ్నాయ పార్టీ కనిపించకపోవడంతో మళ్లీ బీజేపీకే పట్టం కట్టారని సర్వేలో తేలిందని దిలీప్ రెడ్డి చెప్పారు. గుజరాత్‌లో పీపుల్స్‌పల్స్ సంస్థ ఎగ్జిట్ పోల్ 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 240 పోలింగ్ స్టేషన్లలో సర్వే నిర్వహింందని తెలిపారు.
హిమాచల్‌లో కాంగ్రెస్-బీజేపీ హోరాహోరీ
పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి 29-39, బీజేపీకి 27-37, ఇతరులకు 2-5 సీట్లు వచ్చే అవకాశముంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 0.4 శాతం మాత్రమేనని దిలీప్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి 45.9 శాతం, బీజేపీకి 45.5 శాతం, ఆమ్ ఆద్మీ పార్టీకి 2.1 శాతం, ఇతరులకు 6.5 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రియాంక గాంధీ ప్రచారం వల్ల హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరిందని, రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావం ఈ ఎన్నికలపై ఏ మాత్రం లేదని స్పష్టం చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారపీఠం కైవసం చేసుకోవాలంటే 35 సీట్లు గెలవాలని, హంగ్ వస్తే స్వతంత్ర అభ్యర్థులు ఈసారి హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తెలిపారు. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1 శాతం ఓట్ల తేడాతోనే కాంగ్రెస్ 16 సీట్లు కోల్పోయిందని, చిన్నరాష్ట్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల శాతంలో స్వల్ప తేడా కూడా రాజకీయ పార్టీల తలరాత మార్చేస్తుందని దిలీప్ రెడ్డి వివరించారు. 2017 ఎన్నికలతో పోల్చి చూస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4.2 శాతం ఓట్లను అధికంగా పొందుతుండగా బీజేపీ 3 శాతం ఓట్లను కోల్పోయే అవకాశాలున్నట్టు పీపుల్స్‌పల్స్ పోస్ట్ పోల్ సర్వేలో వెల్లడైంది.
అధికార బీజేపీపై ప్రభుత్వోద్యోగులు పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని పీపుల్స్ పల్స్ సర్వేలో తేలింది. పాత పెన్షన్ పథకం ఎత్తివేత, నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం, యాపిల్ పంటకు కనీస మద్దతు ధర, అభివృద్ధి, అవినీతి ప్రధానమైన సమస్యలని పీపుల్స్‌పల్స్ వెల్లడించింది. నిత్యావసర వస్తువుల ధరలపెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైందని దిలీప్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులన్నీ డబుల్ ఇంజిన్ సర్కారు వల్లే సాధ్యమయ్యాయని, ప్రజల మనసుల్లో నాటే ప్రయత్నంలో బీజేపీ కొంతవరకు సఫలమైందని అభిప్రాయపడ్డారు. హిమాచల్‌ప్రదేశ్‌లో పీపుల్స్ పల్స్ సంస్థ పోస్ట్‌పోల్ సర్వేను నవంబర్ 15 నుంచి నవంబర్ 22 వరకు 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 96 పోలింగ్‌స్టేషన్లలో నిర్వహించినట్టు చెప్పారు. పది సంవత్సరాలుగా 17 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పీపుల్స్ పల్స్ సంస్థ నమ్మకమైన సర్వేలు చేసి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిందని దిలీప్ రెడ్డి తెలిపారు.