గుజరాత్ అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ దూకుడు పెంచింది. 46 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే తొలి జాబితాలో 43 మంది అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా జాబితాతో 182 సీట్లకు గాను ఇప్పటిదాకా ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 89కి చేరుకుంది. తాజా జాబితాలో మమద్‌భాయ్ జంగ్ జాట్ (అబ్దాసా), రాజేందర్‌సింగ్ జడేజా (మాండ్వీ), అర్జన్‌భాయ్ భూడియా (భుజ్), నౌషాద్ సోలంకి (దసాదా- ఎస్సీ), కల్పనా కరంసిభాయ్ మక్వానా (లింబ్డి) వంటి ప్రముఖులు ఉన్నారు. ముగ్గురు మహిళా నేతలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
హస్తం గూటికి మాజీ సీఎం శంకర్‌సింగ్ వాఘేలా
మాజీ ముఖ్యమంత్రి శంకర్‌సింగ్ వాఘేలా శనివారంనాడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. వాఘేలా 2017వ సంవత్సరంలో గుజరాత్ అసెంబ్లిలో ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించారు. రెండు వారాల క్రితం వాఘేలా కుమారుడు, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన మహేంద్రసింగ్ వాఘేలా తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. 2017లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటు వేసిన ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో శంకర్‌సింగ్ వాఘేలా, ఆయన కుమారుడు మహేంద్రసింగ్ ఉన్నారు.
శంకర్‌సింగ్ వాఘేలా గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు. శంకర్ సింగ్ కేంద్రంలోని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయించుకున్నప్పుడు గుజరాత్ అసెంబ్లిలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగిన వాఘేలా ప్రజాశక్తి డెమోక్రటిక్ పార్టీ పేరుతో కొత్త పార్టీని కూడా స్థాపించిన విషయం తెలిసిందే.
ఎన్సీపీతో కాంగ్రెస్ పొత్తు
నేషనలిస్ట్ కాంగ్రెస్‌తో కాంగ్రెస్ పార్టీ పొత్తు కుదుర్చుకున్నది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ రాష్ట్రంలోని మొత్తం 182 స్థానాల్లో మూడింటిలో పోటీ చేయనున్నది. ఈ మేరకు శుక్రవారం రెండు పార్టీలు సంయుక్తంగా ప్రకటన చేశాయి. 2017 అసెంబ్లి ఎన్నికల్లో గుజరాత్ ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఎన్సీపీకి చెందిన కంధాల్ జడేజా ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే నిలిచారు. ఆయన పోర్‌బందర్ జిల్లాలోని కుటియానా అసెంబ్లి స్థానం నుంచి గెలుపొందారు. ఎన్‌సీపీతో కలిసి పోటీ చేయనున్నట్లు గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగదీశ్ ఠాకూర్ తెలిపారు. ఉమ్రేత్ (ఆనంద్ జిల్లా), నరోడా (అహ్మదాబాద్), డియోగర్ (దహూద్ జిల్లా) స్థానాల్లో ఎన్‌సీపీ పోటీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 125 సీట్లు గెలుపొంది మళ్లి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్సీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు జయంత్ పటేల్ బోస్కీ విలేకరులతో మాట్లాడుతూ గుజరాత్ అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌కు ఎన్సీపీ మద్దతు ఇస్తుందని చెప్పారు.
రికార్డు స్థాయిలో నగదు, మద్యం పట్టివేత
అసెంబ్లి ఎన్నికలు జరుగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో ఈసారి రికార్డు స్థాయిలో అక్రమ నగదు, మద్యం పట్టుబడినట్టు ఎన్నికల కమిషన్ శుక్రవారంనాడు వెల్లడించింది. అధికారుల సమాచారం ప్రకారం, హమాచల్ ప్రదేశ్‌లో 2017 అసెంబ్లి ఎన్నికలతో పోలిస్తే ఈసారి పట్టుబడిన అక్రమ నగదు, మద్యం ఐదు రెట్లు పెరిగింది. గతంలో రూ.9.03 కోట్ల విలువైన నగదు, మద్యం పట్టుబడగా, ఈసారి అది రూ.50.28 కోట్లకు చేరింది. గుజరాత్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. 2017 అసెంబ్లికి ముందు పంపిణీకి సిద్ధంగా ఉన్న రూ.17,21 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకోగా, గుజరాత్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించినప్పటి నుంచి ఇంతవరకూ రూ.71.88 కోట్ల విలువైన అక్రమ నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది.