Tuesday, November 26, 2024

గుజరాత్‌ అసెంబ్లిఎన్నికలు.. క్రికెటర్‌ జడేజా భార్యకు బీజేపీ టికెట్‌

గుజరాత్‌ అసెంబ్లి ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ దూకుడు పెంచింది. ఒకేసారి 160 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఇవ్వాల (గురువారం) విడుదల చేసింది. 38 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు నిరాకరించింది. భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రివాబాతో సహా పలువురు కొత్తవారికి టికెట్లు ఇచ్చి బరిలోకి దించింది. బీజేపీ తొలి జాబితాలో 14 మంది మహిళలకు చోటు లభించింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. కేంద్ర మంత్రులు మన్సుఖ్‌ మాండవీయ, భూపేందర్‌ యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. గురువారంనాడిక్కడ బీజేపీ విడుదల చేసిన తొలి జాబితాలో డిసెంబర్‌ 1న మొదటి దశ పోలింగ్‌ జరుగనున్న 89 నియోజకవర్గాల్లో 84 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయగా, డిసెంబర్‌ 5న జరుగనున్న రెండో దశ పోలింగ్‌ 93 స్థానాలకు గాను 76 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జామ్‌నగర్‌ ఉత్తర నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేయనుంది. ఇక కాంగ్రెస్‌ పార్టీని వీడి బీజేపీలో చేరిన పటీదార్‌ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ విరామ్‌గాం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. గుజరాత్‌ హోంమంత్రి హర్ష్‌ సంఘవి మజురా నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. మాజీ సీఎం విజయ్‌ రూపానీ, మరో ముగ్గురు సీనియర్లు అసెంబ్లి ఎన్నికల్లో పోటీ చేయబోమని ప్రకటించారు. రూపానీ ఆగస్టు 2016 నుంచి సెప్టెంబర్‌ 2021 వరకు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం, ఆయన రాజ్‌కోట్‌ వెస్ట్‌ నుండి ఎమ్మెల్యేగా ఉన్నారు.

మోర్బీ సాహసవీరుడు కాంతిలాల్‌కు టికెట్‌

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో గల మచ్చు నదిపై ఉన్న తీగల వంతెన కూలిపోవడంతో సుమారు 140 మంది మృతి చెందారు. ఎన్నికల వేళ జరిగిన ఈ దుర్ఘటన… అధికారంలో ఉన్న బీజేపీని ఇరకాటంలోకి నెట్టింది. దాంతో ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక విషయంలో కమలం పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. మాజీ ఎమ్మెల్యే కాంతిలాల్‌ అమృతియాను బరిలోకి దింపింది. ఆయన తీగల వంతెన దుర్ఘటన సమయంలో నదిలో దూకి పలువురి ప్రాణాలు కాపాడిన విషయం తెలిసిందే. భాజపా అభ్యర్థుల జాబితాలో తొలుత కాంతిలాల్‌ పేరు లేనప్పటికీ, నదిలో దూకి ఆయన చేసిన సాహసమే టికెట్‌ దక్కేందుకు కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే బ్రిజేశ్‌ మెర్జాకు నిరాశ ఎదురైంది.
గుజరాత్‌ అసెంబ్లికి రెండు దఫాల్లో పోలింగ్‌ జరగనుంది. డిసెంబర్‌ 1న 89 నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 5న మిగిలిన 93 నియోజకవర్గాల్లో పోలింగ్‌ నిర్వహిస్తారు. డిసెంబర్‌ 8న కౌంటింగ్‌ జరుగనుంది. బీజేపీ వరుసగా ఆరోసారి ఎన్నికల్లో విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉంది. అయితే ప్రతిపక్ష కాంగ్రెస్‌కు తోడు ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా గుజరాత్‌లో పాగా వేయాలని చూస్తోంది.

మోడీ, అమిత్‌ షాలకు కృతజ్ఞతలు తెలిపిన రవీంద్ర జడేజా

- Advertisement -

రవీంద్ర జడేజా సతీమణి రివాబాకు బీజేపీ టికెట్‌ ఇవ్వడం పట్ల ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాలకు కృతజ్ఞతలు తెలిపాడు. తన అర్ధాంగి రివాబా పట్ల నమ్మకం ఉంచి ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇచ్చారంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. అటు రవీంద్ర జడేజా తన భార్య రివాబాకు శుభాకాంక్షలు తెలియజేశారు. ”నువ్వు బీజేపీ తరఫున విధాన సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకోవడం పట్ల గర్విస్తున్నా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టం, నీ ప్రయత్నాలు ఫలించాయి. సమాజ అభ్యున్నతి కోసం ఇకపైనా నీ కృషి కొనసాగిస్తావని ఆశిస్తున్నా” అంటూ జడేజా భార్యనుద్దేశించి వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement