భారీ వర్షాలకు గుజరాత్ రాష్ట్రం ఆగమాగై అవుతోంది. దక్షిణ గుజరాత్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని నదుల నీటి మట్టం పెరిగి లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. దీంతో నవ్సారి, వల్సాద్ జిల్లాల్లో 700 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. ఛోటా ఉదేపూర్, నర్మదా జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయని, నదులు పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఛోటా ఉదేపూర్‌లో వంతెన కూలిపోయింది.
అదేవిధంగా ఒర్సాంగ్ నది మట్టం పెరగడంతో వల్సాద్‌లోని కొన్ని లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చాయి. కావేరీ, అంబికా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో నవ్‌సారి జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తం అయ్యారు. శనివారం రాత్రి, ఆదివారం ఉదయం వల్సాద్, నవ్‌సారి జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. దక్షిణ గుజరాత్‌లోని డాంగ్, నవ్‌సారి, వల్సాద్ జిల్లాల్లో రాబోయే ఐదు రోజులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.