అమరావతి,ఆంధ్రప్రభ: తప్పనిసరి విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రయివేట్ స్కూళ్లలో పేద విద్యార్ధుల ఉచిత ప్రవేశానికిగాను 2023-24 ఏడాదికి రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రయివేట్ అన్‌ఎయిడెడ్ స్కూళ్లు తమ సంస్థల్లో 25 శాతం సీట్లు పేద, బలహీన వర్గాల విద్యార్దులకు కేటాయించాల్సి ఉంటుంది. అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో మార్చి 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. మార్చి 6 నుంచి 16వ తేదీలోపు ప్రయివేట్ స్కూళ్లు అన్ని పాఠశాల విద్యాశాఖ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని చెప్పారు.
పద్దెనిమిదో తేదీ నుంచి ఏప్రిల్ ఏడో తేదీ వరకు విద్యార్ధులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. విద్యార్ధులు పేర్లను నమోదు చేసుకునేందుకు ఆ స్కూల్ హెడ్ మాస్టర్, ప్రిన్సిపల్ సహాయం తీసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 9 నుండి 12వ తేదీ వరకు విద్యార్ధుల అర్హతలను నిర్ణయిస్తారు. ఏప్రిల్ 13వ తేదీన ఫస్ట్ రౌండ్ లాటరీ రిజల్ట్స్‌ను ప్రకటిస్తారు. ఏప్రిల్ 15వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు స్కూళ్లలో విద్యార్దుల అడ్మిషన్ జరుగుతుంది. ఏప్రిల్ 25వ తేదీన రెండో దశ లాటరీ ఫలితాలను ప్రకటిస్తారు. 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు స్కూళ్లలో విద్యార్ధుల అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది. తల్లితండ్రులకు ఏమైనా అనుమానాలుంటే 14417 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చునని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.