న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చేనేతపై జీఎస్టీ రద్దు చేయాల్సిందేనని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ అన్నారు. చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్ను ఉండకూడదని మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో అఖిల భారత పద్మశాలి సంఘం ప్రతినిధులు కలిశారు. జీఎస్టీ వల్ల చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను వారు వివరించారు. చేనేత రంగాన్ని, చేనేత కళాకారుల జీవితాలను కాపాడాలంటే చేనేతపై జీఎస్టీ పన్ను తొలగించడానికి తాము చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలపాల్సిందిగా శరద్ పవార్‌ను కోరారు. మీకు మహారాష్ట్ర ప్రభుత్వ మద్దతు వుంటుందని ఆయన హామీ ఇచ్చారు. జీఎస్టీ కౌన్సిల్‌లో డిమాండ్ చేయవలసిందిగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి అజిత్ పవార్‌కు చెబుతానని, అజిత్ పవార్‌కు పంపడానికి కావలసిన డాక్యుమెంట్లు, సమాచారాన్ని అడిగి తీసుకున్నారు.
ప్రధానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం ఆధ్వర్యంలో రాసే చేనేత మహా వస్త్ర లేఖపై శరద్ పవార్ సంతకం చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు స్వామి, ప్రధాన కార్యదర్శి జగన్నాథం, చేనేత విభాగం జాతీయ అధ్యక్షులు వెంకన్న నేత, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..