Tuesday, November 26, 2024

Delhi | మనీ లాండరింగ్ చట్టం పరిధిలోకి జీఎస్టీ సరికాదు.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) పరిధిలోకి వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ని తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య శాఖ మంత్రి టి. హరీష్ రావు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కోసం మంగళవారం ఉదయం ఢిల్లీ వచ్చిన ఆయన, సమావేశంలో పలు అంశాలను ప్రస్తావించారు. తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ నిధులు ఇతర రాష్ట్రాలకు చెల్లించిన అంశాన్ని పరిష్కరించాల్సిందిగా కోరారు.

ఈ విషయంపై చాలా కాలంగా అడుగుతున్నా ఇంతవరకు కొలిక్కిరాలేదని చెప్పారు. ఉదాహరణకు, మహారాష్ట్రకు చెందిన ఒక టాక్స్ పేయర్ రూ. 82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉందని, ఈ విషయాన్ని ఆ టాక్స్ పేయర్ కూడా అంగీకరించారని గుర్తుచేశారు. అయితే తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చారని, కానీ పెండింగ్‌లోనే ఉండిపోయిందని అన్నారు. గతంలో జరిగిన 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే ఈ అంశాన్ని లేవనెత్తామని, ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ ఇచ్చినా అది కార్యరూపం దాల్చలేదని చెప్పారు.

- Advertisement -

ఇలాంటి అంశాలను సత్వరం పరిష్కరించేందుకు గతంలో హామీ ఇచ్చినట్లుగా ఆఫీసర్ల బృందాన్ని లేదా గ్రూఫ్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఈ ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించారని అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో చెప్పారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో వెల్లడించినట్టు ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు.

వెనుకబడ్డ జిల్లాలకు నిధులు ఇవ్వండి

జీఎస్టీ కౌన్సిల్ సమావేశం అనంతరం అక్కడే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ను విడిగా కలిసిన మంత్రి హరీష్ రావు.. తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్య్వస్థీకరణ చట్టం 2014లోని సెక్షన్ 94(2) ప్రకాం ఈ మేర నిధులు విడుదల చేయాల్సినప్పటికీ విడుదల కావడం లేదని తెలిపారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 మరియు 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ఏడాదికి  రూ. 450 కోట్లు మేర నిధులు ఇచ్చారని, 2014-15, 2019-20, 2021-22 మరియు 2022-23 ఆర్థిక సంవత్సరాలకు తెలంగాణకు నిధులు మంజూరు చేయలేదని వివరించారు. ఈ మేరకు ఆయన ఓ వినతి పత్రాన్ని కేంద్ర మంత్రికి అందజేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement