Saturday, September 21, 2024

AP | ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక అంశాలపై సాయం కోరిన పయ్యావుల

ఢిల్లీలో 53వ జీఎస్టీ పాలక మండలి సమావేశం జరిగింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…. రాష్ట్ర విభజన కార‌ణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందులతో పాటు అన్ని సమస్యలను సవివరంగా వివరించానని తెలిపారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో ఆర్థిక పరమైన తప్పులు జరిగాయని, వాటిని సరిదిద్దేందుకు కేంద్రం సహకరించాలని కోరినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసేందుకు సహకారం అందించాలని, అలాగే రాజధాని నిర్మాణం, వెనుక బడిన జిల్లాలకు ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని పయ్యావుల పేర్కొన్నారు. పారిశ్రామిక రాయితీలపైనా సమావేశంలో ప్రస్తావించినట్లు చెప్పారు. ఆక్వా, టెక్స్‌టైల్ పార్కులు రాష్ట్రానికి మంజూరు చేయాలని కోరారు.

గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు మద్దతు కోరినట్లు తెలిపారు. గ్రేహౌండ్స్ టైనింగ్ సెంటర్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్‌ ఏర్పాటుపై అండగా ఉండాలని విజ్ఞప్తి చేసినట్లు పయ్యావుల పేర్కొన్నారు. అలాగే చేనేత వస్త్రాలపై 5 శాతం పన్ను మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ పాలక మండలి సమావేశం ద్వారా కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement