Tuesday, November 26, 2024

జూన్‌లో 12 శాతం పెరిగిన జీఎస్టీ వసూళ్లు.. 1.61 లక్షల కోట్లుగా నమోదు

జీఎస్టీ వసూళ్ల రికార్డ్‌ కొనసాగుతున్నది. జూన్‌లో 12 శాతం పెరిగి 1.61 లక్షల కోట్లకు ఇవి చేరాయి. 2017, జులై1 న జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చిన తరువాత 1.60 లక్షల కోట్ల వరకు జీఎస్టీ వసూళ్లు నమోదు కావడం ఇది నాలుగో సారి. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో సరాసరి నెలకు 1.10 లక్షల కోట్లు, 2022-23 ఆర్ధిక సంవత్సరంలో సరాసరి నెలకు 1.51 లక్షల కోట్లు, 2023-24 ఆర్ధిక సంవత్సరంలో 1.69 లక్షల కోట్లు వసూలైనట్లు ఆర్ధిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ జూన్‌లో మొత్తం జీఎస్టీ వసూళ్లు 1,61,497 కోట్లుగా నమోదయ్యాయి. ఇందులో కేంద్ర జీఎస్టీ 31,013 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ 38,292 కోట్లు, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ 80,292 కోట్లు ఉన్నాయి.

- Advertisement -

ఇందులో దిగుమతి చేసుకున్న వస్తువులపై వచ్చిన 39,035 కోట్లు కలిసి ఉన్నాయి. సెస్‌ రూపంలో 11,900 కోట్లు సమకూరినట్లు ఆర్ధిక శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. గత సంవత్సరం జూన్‌లో వచ్చిన జీఎస్టీ కంటే, ఈ సంవత్సరం జూన్‌లో 12 శాతం జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. జూన్‌లో ఎక్కువగా దేశీయ లావాదేవీల నుంచే ఎక్కువ మొత్తం జీఎస్టీ వసూలైంది. ఈ సంవత్సరం ఏప్రిల్‌లో రికార్డ్‌ స్థాయిలో జీఎస్టీ వసూళ్లు 1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. మే నెలలో ఇవి 1.57 లక్షల కోట్లుగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో….

తెలంగాణలో 4,681.39 కోట్ల మేర జీఎస్టీ వసూళ్లు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో వచ్చిన 3,901.45 కోట్లతో పోల్చితే 20 శాతం మేర పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ జూన్‌లో 3,477.42 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు జరిగాయి. గత సంవత్సరం ఇదే కాలంలో ఏపీలో 2,986.52 కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. గత సంవత్సరం జూన్‌తో పోల్చితే తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు 20 శాతం పెరిగితే, ఏపీలో 16 శాతం పెరిగాయి. మహారాష్ట్రలో గత జూన్‌తో పోల్చితే 17 శాతం పెరిగి 26,098.78 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైంది. జీఎస్టీ వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement