Thursday, November 21, 2024

జీఎస్‌టీ బకాయిలు విడుదల, 21 రాష్ట్రాలకు రూ.86వేల కోట్లు.. తెలంగాణకు రూ.296 కోట్లు

కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తోన్న జీఎస్‌టీ బకాయిల చెల్లింపు వ్యవహారం మొత్తానికి సుఖాంతమైంది. ఈ బకాయిలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ బకాయిలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాష్ట్రాల వారీగా ఎంత మొత్తాన్ని కేటాయించామనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ సహా మొత్తం 21 రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్‌టీ బకాయిలను మంజూరు చేసినట్టు ఈ ప్రకటనలో తెలిపింది. దీని మొత్తం రూ.86,912 కోట్లుగా తేల్చింది. కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్‌టీ బకాయిల కోసం ఏపీ, తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. పార్లమెంట్‌లోనూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాల తరఫు నుంచి ఎంపీలు తమ గళం వినిపించారు. ఈ ఏడాది ఏపీ, తెలంగాణకు ఫిబ్రవరి-మార్చి నెలలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.21,322 కోట్లు. జనవరి 2022 వరకు మంజూరు చేయాల్సిన మొత్తం రూ.47,617 కోట్లు. ఈ రెండింటినీ కలిపి ఏక మొత్తంలో విడుదల చేసినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ వివరించింది. ఏపీకి రూ.3,199 కోట్లు, తెలంగాణకు రూ.296 కోట్లు మంజూరయ్యాయి. జీఎస్‌టీ బకాయిల చెల్లింపు విషయంలో మహారాష్ట్ర టాప్‌లో నిలిచింది. మహారాష్ట్రకు రూ.14,145కోట్లు. అసోంకు రూ.232 కోట్లు, ఛత్తీస్‌గడ్‌కు రూ.1434కోట్లు, ఢిల్లిdకి రూ.8,032 కోట్లు, గోవాకు రూ.1,291 కోట్లు, గుజరాత్‌కు రూ.3,364కోట్లు, హర్యానాకు రూ.1,325 కోట్లు, హిమాచల్‌ ప్రదేశ్‌కు రూ.838 కోట్లు, జార్ఖండ్‌కు రూ.1,385 కోట్లు, కర్నాటకకు రూ.8633 కోట్లు, మధ్యప్రదేశ్‌కు రూ.3,120కోట్లు, పుదుచ్చేరికి రూ.576 కోట్లు, పంజాబ్‌కు రూ.5,890కోట్లు, రాజస్థాన్‌కు రూ.963కోట్లు, తమిళనాడుకు రూ.9602కోట్లు, తెలంగాణకు రూ.296కోట్లు, ఉత్తరాఖండ్‌కు రూ.1449కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.6591 కోట్లు మంజూరయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement