జీఎస్ఎల్వీ ఎఫ్ 14 ప్రయోగానికి కౌంట్డౌన్ కొనసాగుతోంది. భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం శ్రీహరికోట నుంచి ఇవాళ సాయంత్రం 5.35 గంటలకు ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
మొత్తం 27.5 గంటల పాటు కౌంట్ డౌన్ ఉంటుంది. వాతావరణాన్ని అంచనా వేయడం, విపత్తు నిర్వహణకు సేవలు వాడుకోవడం వంటి వాటి కోసం ఇస్రో అభివృద్ధి చేసిన ఇన్‌శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు జీఎస్‌ఎల్‌వీ ఎఫ్14 ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. ఈ రాకెట్ 19 నిమిషాలలోగానే నిర్ణీత కక్ష్యకు చేరేలా శాస్త్రవేత్తలు ప్రణాళికలు రూపొందించారు. ఇస్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ రాకెట్ల సాయంతో మూడేసి చొప్పున గగన్ యాన్‌కు సంబంధించి ఏడు పరీక్షలు చేస్తుంది.
కాగా, జీఎస్ఎల్వీ సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం. పూర్తి స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్ తో ఈ రాకెట్ ను రూపొందించారు. భారత్ బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించేటప్పుడు జీఎస్ఎల్వి రాకెట్లు అవసరమయ్యాయి. ఈ తరహా ప్రయోగాలకు ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ జీఎస్ఎల్వి రాకెట్లను ఇస్రో పూర్తి స్థాయిలో నిర్మిస్తోంది.