Tuesday, November 26, 2024

పెరుగుతున్న మొబైల్‌ వ్యాలెట్‌ చెల్లింపులు

దేశంలో డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నాయి. నగదు వాడకం క్రమంగా తగ్గిపోతున్నది. ప్రధానంగా యూపీఐ చెల్లింపుల విధానం వచ్చిన తరువాత చిన్న చిన్న అవసరాలకు కూడా వ్యాలెట్స్‌ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. మొబైల్‌ వ్యాలెట్‌ ద్వారా యూపీఐ చెల్లింపులు గణనీయంగా పెరుగుతున్నట్లు గ్లోబల్‌ డేటా నివేదిక తెలిపింది. సంప్రదాయ నగదు చెల్లింపులు, కార్డు ద్వారా చేసే చెల్లింపుల తగ్గిపోతున్నాయి. మొబైల్‌ ద్వారా జరిపే చెల్లింపులు భారీగా పెరుగుతున్నాయి. దేశంలో దాదాపు ప్రతి చిన్న వ్యాపారి కూడా క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు స్వీకరిస్తున్నారు. మనకు వీధుల్లో కనిపించే కూరగాయలు, పండ్ల వ్యాపారుల నుంచి రోజువారి అవసరాల కొనుగోళ్ల వరకు అన్ని చోట్లా మనకు క్యూఆర్‌కోడ్‌, గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి అనేక యాప్స్‌ ద్వారా మొబైల్‌ నుంచే చెల్లింపులు చేస్తున్నారు.

2023 నుంచి 2027 మధ్య కాలంలో మొబైల్‌ వ్యాలెట్ల ద్వారా చేసే చెల్లింపులు 23.9 శాతం పెరుగుతాయని గ్లోబల్‌ డేటా నివేదిక అంచనా చేసింది. 2027 సంవత్సరం నాటికి మొబైల్‌ వ్యాటెట్ల ద్వారా చెల్లింపుల విలువ 472.6 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. మన దేశంలో నగదు ద్వారా చెల్లింపులు విధానం ఎక్కువ ప్రజాదరణ పొందిన విధానం. ఇప్పుడు దీని స్థానంలో మొబైల్‌ ద్వారా చేసే చెల్లింపులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. డిజిటల్‌ చెల్లింపులపై ప్రస్తుతానికి ఎలాంటి రుసుం వసూలు చేయకపోవడం వల్ల వీటికి అత్యధికంగా ఆదరణ లభిస్తోంది. ప్రధానంగా యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌( యూపీఐ) ని ప్రవేశపెట్టడంతో దీనికి ఆదరణ పెరుగుతూ వస్తోంది.

- Advertisement -

వినియోగదారులు తమ బ్యాంక్‌ అకౌంట్‌ను మొబైల్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌తో ఇంటిగ్రేట్‌ చేయడానికి అనుమతించడంతో పాటు, మొబైల్‌ నంబర్‌తోనూ, క్యూఆర్‌ కోడ్‌ ద్వారా చెల్లింపులు చేసేందుకు వీలు కల్పించారు. ఒక బ్యాంక్‌ ఖాతా నుంచి మరో బ్యాంక్‌ ఖాతాకు నగదు బదిలీ చేయాడానికి ఈ విధానంలో అనుమతి ఇస్తోంది. దీని వల్ల అత్యంత వేగంగా లావాదేవీలు పెరుగుతున్నాయని గ్లోబల్‌ డేటా తెలిపింది. దేశంలో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు క్యూఆర్‌ కోడ్‌తోనూ, మొబైల్‌ నెంబర్‌తోనూ చెల్లింపులను అంగీకరిస్తున్నారు. దీని వల్లే ఈ లావాదేవీలు పెరిగేందుకు దోహదం చేస్తున్నట్లు తెలిపింది. డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్నందున నగదు చలామణి తగ్గిపోతున్నది. నగదు లావాదేవీలు తగ్గుతున్నాయి. క్రమంగా డిజిటల్‌ ఎకనామివైపు దేశం అడుగులు వేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement