Thursday, November 21, 2024

ఈ – వాహనాలపై పెరుగుతున్న మోజు.. పెరుగుతున్న విక్రయాలు..

అమరావతి, ఆంధ్రప్రభ : రోజురోజుకూ పెరుగుతున్న పెట్రో ధరలతో వాహనదారులు ఈ-వాహనాలు కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. దీంతో రాష్ట్రంలో క్రమంగా విద్యుత్‌ (ఈ) వాహనాల సంఖ్య పెరుగుతోంది. వీటి సంఖ్య నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. 2017లో ద్విచక్రవాహనాలు, త్రిచక్ర వాహనాలు (ఆటోలు), కార్లు కలిపి విద్యుత్‌ వాహనాల సంఖ్య 5,653 ఉంటే గత ఏడాది డిసెంబర్‌ చివరి నాటికి ఈ సంఖ్య 21,565కు పెరిగింది. ప్రధానంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్రల్‌ ఆటోల సంఖ్య వేగంగా పెరుగుతోంది. 2017తో పాటు- 2018 సంవత్సరంలో ఎలక్ట్రిక్రల్‌ ఆటోలు కేవలం ఆరు మాత్రమే ఉన్నాయి. వీటి సంఖ్య గత ఏడాది డిసెంబర్‌ నెలాఖరు నాటికి 2,587కు పెరిగింది. విద్యుత్‌ స్కూటర్ల సంఖ్య కూడా నాలుగేళ్ల నుంచి భారీగానే పెరుగుతోంది. 2017లో 3,195 ఎలక్ట్రిక్రల్‌ స్కూటర్లున్నాయి. వీటి సంఖ్య గత డిసెంబర్‌ చివరి నాటికి 14,441. విద్యుత్‌ కార్ల వినియోగం మాత్రం ఇప్పుడే పెరుగుతోంది. 2017లో 2,452 విద్యుత్‌ కార్లు ఉన్నాయి. గత ఏడాది డిసెంబర్‌ నాటికి వీటి సంఖ్య 4,537కు చేరింది.

చార్జింగ్‌ స్టేషన్లు వస్తే మరింత వృద్ధి..

పెట్రోల్‌, డీజిల్‌ బంక్‌లు తరహాలో విరివిగా బ్యాటరీ చార్జింగ్‌ స్టేషన్లతోపాటు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వస్తే రాష్ట్రంలో ఎలక్ట్రిక్రల్‌ వాహనాల సంఖ్య మరింత పెరుగనుంది.ఇప్పుడిప్పుడే ఎలక్ట్రిక్రల్‌ వాహనాల వినియోగం పెరుగుతోంది. ఛార్జింగ్‌ స్టేషన్లు వస్తే వీటి వినియోగం పెరిగే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్రల్‌ వాహనాలపై పన్ను లేకపోవడం వల్ల కూడా ఇటీవల వాటి వినియోగం పెరుగుతోంది. విద్యుత్‌ కార్ల వినియోగం కూడా పుంజుకుంటోందని చెబుతున్నారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement