Tuesday, November 26, 2024

త్వరలో ‘టెలీగ్రామ్‌’లో గ్రూప్ వీడియో కాల్ ఫీచర్

వాట్సాప్ ప్రైవసీ పాలసీ వివాదం కారణంగా టెలీగ్రామ్ యాప్‌కు డౌన్‌లోడ్‌లు భారీ సంఖ్యలో పెరిగాయి. 2018లో టెలీగ్రామ్ యూజర్ల సంఖ్య 200 మిలియన్‌లు ఉండగా.. 2020లో ఆ సంఖ్య 400 మిలియన్‌లకు చేరింది. ఈ నేపథ్యంలో టెలీగ్రామ్ యాప్ యాజమాన్యం తమ వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. త్వరలోనే టెలీగ్రామ్‌లో గ్రూప్ వీడియో కాల్ ఫీచర్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా టెలీగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వెల్లడించారు. అయితే ఈ గ్రూప్ వీడియో కాల్ ఫీచర్‌ను తొలుత ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు. టెలీగ్రామ్‌లో గ్రూప్ వీడియో కాల్‌కు సంబంధించిన అప్‌డేట్ మే నెలలో విడుదల కానున్నట్లు ఆయన పేర్కొన్నారు.

కరోనా వైరస్ కారణంగా పలు రంగాలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో కార్యాలయాలకు సంబంధించిన సమావేశాలను ఇంటి నుంచే మొబైల్ ద్వారా నిర్వహిస్తున్నారు. దీంతో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా వీడియో కాల్స్‌కు స్కీన్ షేరింగ్, ఎన్‌క్రిప్షన్, నాయిస్ క్యాన్సలేషన్, డెస్క్‌టాప్ అండ్ టాబ్లెట్ సపోర్ట్, వీడియో కాన్ఫరెన్స్ టూల్స్, టెలీగ్రామ్ లెవల్ యూఐ వంటి ఫీచర్లను తమ వినియోగదారులకు ప్రవేశపెడుతున్నట్లు టెలీగ్రామ్ సీఈవో దురోవ్ వెల్లడించారు. కాగా టెలీగ్రామ్ ఇప్పటికే ప్రైవేట్ వీడియో కాల్స్ కోసం ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను అందిస్తోంది. ఇప్పుడు ఈ ఎన్‌క్రిప్షన్ విధానాన్ని గ్రూప్ వీడియో కాల్స్‌కు కూడా అందించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement