Saturday, November 23, 2024

త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్.. యువత రెడీగా ఉండాలని హరీష్‌రావు పిలుపు

సిద్దిపేట/పొన్నాల, ఆంధ్రప్రభ : ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం త్వరలో గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ ప్రకటిస్తుందని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు చెప్పారు. గ్రూప్‌-4లో ప్రకటించే ఉద్యోగాలకు నిరుద్యోగ యువత సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సాధించినపుడే సీఎం కేసీఆర్‌ శిక్షణకు నిజమైన సార్థకత లభిస్తుందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా పొన్నాలలో తెరాస కార్యాలయంలో బుధవారం టెట్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులతో మంత్రి ముఖాముఖి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఎస్పీ నోటిఫికేషన్‌ ఇవ్వకముందే ఉద్యోగార్థులకు లాంగ్‌ టర్మ్‌ శిక్షణ ఇస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన టెట్‌లో 32 శాతం ఉత్తీర్ణత సాధిస్తే సిద్దిపేటలో నిర్వహించిన కేసీఆర్‌ఉచిత శిక్షణా కేంద్రంలో 82 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని, 618 మంది అభ్యర్థులకు 517 మంది పాసయ్యారని చెన్నారు.

ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు అదృష్టవంతులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని హరీష్‌రావు చెప్పారు. 317 జీవోను రద్దు చేయాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జీవో అంతర్యం తెలియకుండా విపక్షాల నేతలు మాట్లాడమేంటని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వంలో పదహారున్నర లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండే నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఈ ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌లో ఉద్యోగం సాధిస్తే అది తుమ్మితే ఊడిపోయే ఉద్యోగమని యువతను నిర్వీర్యం, మోసం చేయడానికే ఈ పథకం తెచ్చారని దుయ్యబట్టారు. కేంద్రంలోని బాజపా సర్కార్‌కు అమ్మడం తప్ప కొత్తగా తెచ్చేది ఏమీ లేదని ఏ రంగానికి ఈ ప్రభుత్వం మేలు చేయలేదని ఆరోపించారు. రూపాయి విలువ పతనమై దేశంలో 8.7 శాతం నిరుద్యోగ సమస్య ఉందని తప్పుడు వార్తలను సృష్టించడంలో బాజపా సర్కార్‌కు డాక్టరేట్‌ ఇవ్వాలని ఎద్దేవా చేశారు. కేంద్ర బాజపా ప్రభుత్వ నేతల మాటల్లో విషం తప్ప విషయం లేదని సిద్దిపేటనంతా తన కుటుంబంలా భావించి అభివృద్ధి చేస్తున్నానని ఆయన వివరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement