Saturday, November 23, 2024

నేడే గ్రూప్‌-4 పరీక్ష.. హాజరుకానున్న 9.51 లక్షల మంది అభ్యర్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రూప్‌-4 పరీక్ష నేడు రాష్ట్రవ్యాప్తంగా జరగనుంది. 9లక్షల 51వేల 321 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. వివిధ శాఖల్లోని 8180 గ్రూప్‌-4 పోస్టులకు గతేడాది డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ పరీక్ష కోసం 2878 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్‌-2 నిర్వహించనున్నారు. పరీక్షకు 15 నిమిషాల ముందే గేట్లు మూసివేయనున్నారు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్‌, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు వంటి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించాలని అధికారులు సూచించారు. హాల్‌టికెట్‌పై ఫోటో లేకపోతే గెజిటెడ్‌ అధికారి సంతకంతో ఉన్న మూడు ఫోటోలతో పరీక్షకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులకు దాదాపు ఐదారు సార్లు క్షుణ్ణంగా తనిఖీలు చేయనున్నారు. గతంలో జరిగిన పలు నియామక పరీక్షల్లో హాజరైన అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌లో బబ్లింగ్‌ పొరపాట్ల వల్ల వందల మంది అనర్హులయ్యారు. ఈ నేపథ్యంలో హాల్‌టికెట్‌, పేపర్‌ కోడ్‌ తదితర వివరాలు బబ్లింగ్‌ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని అధికారులు చెప్పారు.

ఒకరి బదులు మరోకరు రాసినా, ఎలాంటి అవకతవకలకు పాల్పడినా క్రిమినల్‌ కేసులు పెట్టడంతోపాటు భవిష్యత్తులో ఏ ఉద్యోగ నియామక పరీక్షలు రాయకుండా డిబార్‌ చేయనున్నట్లు పేర్కొన్నారు. వైట్‌నర్‌, చాక్‌పౌడర్‌, బ్లేడు, ఎరేజర్‌తో బబ్లింగ్‌లో మార్పులు చేస్తే ఓఎంఆర్‌ షీటును మూల్యాంకనం కోసం పరిగణలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే పరీక్షకు హాజరయ్యే మహిళా అభ్యర్థులు తాళిబొట్టు తీయాలనే నిబంధనే లేదని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్‌ స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఇటాంటి ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మకూడదని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలకు తొందరగా చేరుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement