హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష తేదీను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ఖరారు చేసింది. జూన్ 9న నిర్వహించనున్నట్లు సోమవారం టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ఇటీ-వలే టీ-ఎస్‌పీఎస్సీ 563 పోస్టులతో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈనెల 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. గతంలో గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చిన విషయం విధితమే. దరఖాస్తుల్లో పొరపాట్లు ఉంటే మార్చి 23 ఉదయం 10 గంటల నుంచి 27 సాయంత్రం 5 గంటల వరకు సరిచేసుకోవచ్చని పేర్కొంది. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ జరగనుంది. మెయిన్ పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. టీ-ఎస్పీఎస్సీ పేపర్ లీకుల అనుభవాల దృష్ట్యా ప్రభుత్వం పకడ్బందీ జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఇక ముందస్తు షెడ్యూల్ ప్రకారం మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈక్రమంలోనే మెయిన్స్ పరీక్ష అక్టోబర్‌లో ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయోపరిమితిని ఇటీవల ప్రభుత్వం 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే గ్రూప్-2, 3 పరీక్షల నిర్వహణపై సైతం అధికారులు దృష్టి సారించారు. అదనపు పోస్టులు కలిపి జూలై, ఆగస్టు నెలల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది.