హైదరాబాద్, ఆంధ్రప్రభ : రేపు (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. గతంలో గ్రూప్-1 పేపర్ లీక్ కావడంతో ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీఎస్‌పీఎస్‌సీ అధికారులు ఈసారి భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. పరీక్ష సజావుగా జరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పరీక్ష ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు. 503 గ్రూప్-1 పోస్టులకు పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. అయితే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసేస్తామని టీఎస్‌పీఎస్‌సీ స్పష్టం చేసింది.
ఉదయం 10.15 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించేది లేదని అధికారులు పేర్కొన్నారు. 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో పరీక్ష జరగనుంది. గతంలో గ్రూప్-1 ప్రశ్నపత్రాలు లీక్ అవడంతో ఈసారి పటిష్ట ప్రణాళికతో పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. దీని కోసం ఇప్పటికే పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించి కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లతో సమావేశాలు నిర్వహించారు.
గతేడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షకు 2,86,051 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష నిర్వహణకు 994 మంది చీఫ్ సూపరింటెండెంట్ అధికారులను, 994 మంది లియజన్ ఆఫీసర్లు, 310 రూట్ ఆఫీసర్లను నియమించారు. ఈసారి పరీక్షలకు అథారిటీ ఆఫీసర్లుగా కలెక్టర్లను, చీఫ్ కో ఆర్డినేటర్లుగా సబ్ కలెక్టర్లను నియమించారు. ఈ సారి ప్రతీ పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బయోమెట్రిక్ విధానాన్ని అమలు ఏయనున్నారు. జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు రూపొందించారు.
కఠిన నిబంధనలు…
ఈసారి కఠిన నిబంధనలు అమలు చేయబోతున్నారు. అభ్యర్థులు బూట్లు ధరించి రావొద్దని, చెప్పులతో రావాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రంలో ఇతరులతో మాట్లాడడం, ఎలాంటి స్లోగన్స్ ఇవ్వకూడదని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) హెచ్చరించింది. ప్రశాంతమైన వాతావరణాన్ని కేంద్రాల్లో చెడగొట్టే ప్రయత్నాలను చేసినా కఠిన చర్యలు తప్పవని సూచించింది. అభ్యర్థులకు రెండు దశల్లో తనిఖీ చేసిన తర్వాతే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు పెడతామని, దాంతో పాటు భవిష్యత్తులో టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించే ఎలాంటి పోటీ పరీక్షలకు అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఈనేపథ్యంలో ఒకరోజు ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాన్ని సందర్శిస్తే పరీక్ష రోజు కేంద్రానికి సులువుగా చేరుకోవచ్చని సూచించారు. పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్‌పెన్, క్యాలుకులేటర్, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని తెలిపారు. బ్లూ, బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌లను మాత్రమే అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాలని, వాటిని మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే హాల్‌టికెట్‌తో పాటు పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్ తదితర ఏదేని గుర్తింపు కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఓఎంఆర్ షీట్‌లో వైట్‌నర్, చాక్ పౌడర్, బ్లేడ్, ఎరేజర్ లాంటివి వాడకూడదని అభ్యర్థులకు సూచించారు. హాల్‌టికెట్‌లో ఫోటో సరిగా లేని వారు మూడు ఫోటోలతో గెజిటెడ్ అధికారితో అటెస్టెడ్ చేయించుకొని తీసుకొని రావాలని సూచించారు.