హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రాథమిక కీని టీఎస్‌పీఎస్‌సీ బుధవారం విడుదల చేసింది. కీతో పాటు ఓఎంఆర్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే జూలై 1వ తేదీ నుంచి 5 వరకు ఆన్‌లైన్‌లో తెలియజేయాలని అభ్యర్థులను టీఎస్‌పీఎస్‌సీ సూచించింది.
అభ్యంతరాలను ఆంగ్లంలో మాత్రమే స్వీకరిస్తామని స్పష్టం చేసింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం జూలై మొదటి వారంలో మెయిన్ లిస్టును విడుదల చేసే అవకాశం ఉంది. 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకిగానూ జూన్ 11న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్‌కు ఒక్క పోస్టుకు 50 మందిచొప్పున ఎంపిక చేయనున్నారు.