హైదరాబాద్, ఆంధ్రప్రభ: గ్రూప్-1 503 పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక ‘కీ’ని ఈనెల 29న విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయించింది. ఈమేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనర్థన్ రెడ్డి ఆంధ్రప్రభకు తెలిపారు. కీతో పాటు పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను ఈనెల 16న నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,80,081 మంది గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 2,86,051 మంది పరీక్షకు హాజరయ్యారు.
అయితే ఒక పోస్టుకు 50 మంది అభ్యర్థులను మెయిన్స్ కోసం ఎంపిక చేయనున్నారు. ప్రాథమిక కీని విడుదల చేసిన తర్వాత దానిపై ఐదు లేదా వారం రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉంది. నిపుణుల కమిటీతో అధ్యయనం చేయించి తుది కీ, ఆ తర్వాత ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటీవ్ మెడిసిన్ పరిధిలోని ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ 24 పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షను నవంబర్ 7న నిర్వహించాలని కమిషన్ ఇప్పటికే నిర్ణయించింది.