Friday, November 22, 2024

వేరుశనగ సాగు పెరగాలి.. యాసంగిలో ప్రత్యామ్న్యాయ పంటగా సాగు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రబీ(యాసంగి)లో ప్రత్యామ్న్యాయ పంటగా వేరుశనగ సాగును ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వంట నూనెల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడం, నూనె గింజల దిగుబడులకు మార్కెట్‌లో మంచి గిట్టుబాటు ధర ఉండడంతో తెలంగాణ ప్రభుత్వం వేరుశనగ సాగును ప్రోత్సహిస్తోంది. ఇందుకు ప్రత్యేకంగా వేరుశనగ పరిశోధనా కేంద్రాన్ని వనపర్తి జిల్లాలో పెద్ద మందాడి మండలం వీరాయపల్లిలో పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ పరిశోధనా కేంద్రంలో అంతర్జాతీయ స్థాయి వాణిజ్య పంటల సాగుపై పరిశోధనలు చేయనున్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వ విద్యాలయం పరిధిలో ఈ పరిశోధనా కేంద్రం పనిచేయనుంది. వేరుశనగ పరిశోధనా కేంద్రానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 40 ఎకరాల భూమితోపాటు రూ.2కోట్ల నిధులను కేటాయించింది. వేరుశనగ విత్తనాల్లో నూతన వంగడాలను ఎప్పటికప్పుడు రైతులకు అందుబాటులో ఉంచేలా పరిశోధనలు జరగాలని ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలకు నిర్దేశించింది.

ప్రస్తుతం దక్షిణ తెలంగాణలో కొద్దో గొప్పో వేరుశనగ సాగువుతోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడా రైతులు వేరుశనగ సాగు చేస్తున్నారు. అయితే వంటనూనెల కొరత, వేరుశనగ దిగుబడికి ఉన్న డిమాండ్‌ దృష్ట్యా నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ తదితర జిల్లాల్లోనూ వేరుశనగ సాగును ప్రోత్సహించాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ ఏటా విడుదల చేసే క్రాప్‌ క్యాలండర్‌లోనూ యాసంగిలో వేరుశనగ సాగును ప్రాధాన్యతా అంశంగా చేర్చాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మరింత విస్తారంగా వేరుశనగ సాగు అయ్యేలా చూసేందుకు వ్యవసాయశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 2024 యాసంగిలో రాష్టగ్రంలో కనీసం 30 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతోంది.

- Advertisement -

వేరుశనగ సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు టీఎస్‌-ఆయిల్‌ఫెడ్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. వేరుశనగ నుంచి నూనెను తీసే మిల్లులను విస్తారంగా నెలకొల్పాలని నిర్ణయించింది. వేరుశనగను మార్కెట్‌లో ఎంతకో కొంత గిట్టుబాటు ధరకు అమ్ముకోవడం కాకుండా నేరుగా నూనె మిల్లులకు పంటను అమ్ముకోవడం ద్వారా రైతులకు అధిక ధర లాభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కోటి 30లక్షల ఎకరాల వ్యవసాయ భూమి అందుబాటులో ఉండగా ఇందులో 50లక్షల ఎకరాల్లో వరి, మరో 40లక్షల ఎకరాల్లో పత్తి, ఆ తర్వాత మిరప, సోయా, పసుపు మరో 15 లక్షల ఎకరాల్లో సాగవుతున్నాయి. అయితే పప్పు దినుసులు, వేరుశనగ తదితర పంటలసాగు ఆశించినస్థాయిలో లేదు. అయితే వంట నూనెల పంటల సాగుకు రోజు రోజుకు డిమాండ్‌ పెరుగుతుండడంతో ఆయిల్‌ఫామ్‌ సాగును రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం విస్తారంగా ప్రోత్సహిస్తోంది. ఆయిల్‌ఫామ్‌తోపాటు వేరుశనగను కూడా పెద్ద ఎత్తున సాగు చేసేలా రైతుల్లో అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement