హైదరాబాద్, ఆంధ్రప్రభ: తమిళనాడు రాజధాని చెన్నయ్ నగర దాహార్తిని తీర్చేందుకు ఈనెల 14వ తేదీ ఉదయం 11 గంటకు ఆన్లైన్ విధానంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం కానుంది. ఈ సమావేశానికి సంబంధించి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులకు సమాచారం అందజేసిన కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ రాయ్‌పురే ఈ కీలక సమావేశంలో ఖచ్చితంగా పాల్గొనాలని కోరారు.
మరోవైపు గోదావరి యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ) సమావేశం కూడా ఈ నెల 13న జరగనుంది. సీతారామ ఎత్తిపోతల పథకం, సీతారామ బహుళార్థసాధక ప్రాజెక్టు పథకాలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)ను గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం సమర్పించనుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న జీఆర్ఎంబీ భేటీకి హాజరుకావాలంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు జీఆర్ఎంబీ సమాచారం పంపింది.
ఈనెల 6న జరగాల్సిన ఈ సమావేశాన్ని తెలంగాణ అభ్యర్థన మేరకు గోదావరి బోర్డు ఈనెల 13కు వాయిదా వేసిన విషయం తెలిసిందే. మరోవైపు గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలపై చర్చించేందుకు జాతీయ జలాభివృద్ధి సంస్థ ఈ నెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. ఎర్రమంజిల్‌లోని జలసౌధలో అథారిటీ చైర్మన్ భూపాల్‌సింగ్ నేతృత్వంలో సమావేశం కొనసాగనుంది.
ఈ మేరకు ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులు తెలంగాణ అధికారులకు సమాచారం అందించారు. జీసీ రివర్ లింక్ ప్రాజెక్టును ఎక్కడ చేపట్టాలనే అంశంపై చాలా కాలంగా చర్చ సాగుతోంది. ముందుగా సమ్మక్క సాగర్ నుంచి, తర్వాత ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేందుకు ప్రతిపాదనలు చేశారు. ఎన్‌డబ్ల్యూడీఏ బోర్డు సమావేశంలో, ఇంద్రావతి నుండి కూడా కొత్త తరలింపు ప్రతిపాదించబడింది. ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో 9న ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశం నిర్వహించి సందేహాలను నివృత్తి చేయాలని నిర్ణయించింది.