హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : పేదల సొంతింటి కలను నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ‘గృహలక్ష్మి’ పథకాన్ని విస్తృతం చేస్తోంది. మొదట్లో నిర్ణయించిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్హులందరికీ ‘డబుల్ బెడ్ రూమ్’ ఇళ్ళను నిర్మించి ఇవ్వాలనుకున్నప్పటికీ సకాలంలో లక్ష్యాన్ని చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. నిర్మాణ ప్రక్రియలో చోటు చేసుకున్న జాప్యం కారణంగా లర్హులైన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం కేసీఆర్ ‘గృహలక్ష్మి’ పథకం పేరుతో ఇళ్ళ పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఈ క్రమంలో జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న దవాబ్ధి ఉత్సవాల్లో భాగంగా పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఆదేశాలు జారీ చేశారు. పట్టా పొందిన ప్రతి లబ్ధిదారుడి కుటుంబానికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ సొంతింటి కలను నెరవేర్చుకునే దిశగా ప్రోత్సహించనున్నారు. 21 రోజులపాటు జరిగే దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా మొదటి విడతగా ప్రతి గ్రామంలో 100 మంది లబ్ధిదారులకు తగ్గకుండా పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఇంకా మిగిలివున్న అర్హులకు రెండో విడతగా పట్టాలు అందజేసేందుకు జిల్లా కలెక్టర్లు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గ్రామ పంచాయతీలు కీలక భూమిక పోషించనున్నాయి.
సర్పంచ్‌లు సిపారసు చేసిన జాబితాలపై స్థానిక మండల అభివృద్ధి అధికారి పర్యవేక్షణలోని బృందాలు విచారణ జరిగి తుది నిర్ణయం తీసుకుంటారు. అలాగే నియోజకవర్గ కేంద్రాల్లో పూర్తయిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ళ ప్రారంభోత్సవాలను కూడా దశాబ్ధి ఉత్సవాల్లోనే చేపట్టేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చింది. స్థానిక ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధుల చేతుల మాదుగా అధికార యంత్రాంగం లబ్ధిదారులకు పట్టాలను అందజేయనుంది. ఈ క్రమంలో సొంత జాగ ఉన్న వారికి ఆర్థిక సాయం అందించాలని కూడా సర్కారు నిర్ణయించింది. గతేడాదే ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
రూ.3 లక్షల ఆర్థిక సాయం..
సొంత జాగాలున్న పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం ‘గృహలక్ష్మి’ పథకం కింద రూ.మూడు లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో నాలుగు లక్షల మందికి రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు ఇస్తారు. వీటితో పాటు 43 వేల ఇళ్లు రాష్ట్ర కోటాలో ఉంటాయి. రూ. 12 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇళ్లను ఆ ఇంట్లోని గృహిణి పేరిటే మంజూరు చేస్తారు. ఈ లెక్కన మొదట విడతలో ఈ పథకం ద్వారా మూడు లక్షల 50 వేల మందికిపై లబ్ది పొందే అవకాశం ఉంది. సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకునే స్థోమత లేనివారికి, అలాగే ఇల్లు కూలిపోయిన వారికి ఈ పథకం వర్తించనుంది.
ఎన్నికల తరుణంలో లబ్ధిదారుల్లో చిగురిస్తున్న ఆశలు..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ఈ పథకంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వం అందించే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని పొందాలని చూస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మార్వో, ఎంపీడీవోలకు అప్పగించారు. ఈ పథకానికి సంబంధించి నిబంధనలు కూడా సరళంగానే ఉండనున్నట్లు ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించారు. అయితే, తుది మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు వర్గాలకు లబ్ధి చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది సర్కార్. అయితే ఈ పథకం విషయంలో కూడా సరళంగానే నిబంధనలు ఉండేలా చూడటం.. పారదర్శకంగా లబ్ధిదారులకు వర్తింపజేయటం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టిపెట్టే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది.
ఒకటి, రెండు రోజుల్లోనే మార్గదర్శకాలు
అయితే, ఈ స్కీమ్‌కు ఎలాంటి నిబంధనలు ఉంటాయన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ప్రభుత్వ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకు ఒకటి, రెండు రోజుల్లోనే ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు వెలువడనున్నాయి. గతంలో ఇందిరమ్మ ఇళ్లు పొందిన వారు ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారా..? ఏ ఏ అంశాలను ప్రతిపాదికన తీసుకుంటారు..? ఇంటి నిర్మాణానికి కనిష్ఠంగా ఎన్ని గజాల స్థలం ఉండాలి..? భూమి మగవారి పేరుపై ఉన్నప్పటికీ.. ఆ ఇంట్లోని మహిళని లబ్ధిదారుగా గుర్తిస్తారా..? తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేస్తారా..? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. నిజానికి క్షేత్రస్థాయిలో చాలా మంది పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్లపై ఆశలు పెట్టుకున్నప్పటికీ.. అవి వచ్చే పరిస్థితి లేదు. పూర్తిగా ఎలాంటి ఆధారం లేని వారికి మాత్రమే ఆ ఇళ్లను కేటాయిస్తున్నారు. అయితే సొంతంగా ఇళ్లు కట్టుకోవాలనే వారికి మాత్రం ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు. గతంలో ఇందిరమళ్ల ఇళ్ల పథకంలో భాగంగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందేది. కానీ ప్రస్తుతం ఆ స్కీమ్ లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్… గృహ లక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. 4 లక్షల మందికి 3 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది.
‘డబుల్’ ఇళ్లకు దరఖాస్తులు ట్రిపుల్!
డబుల్ బెడ్‌రూం ఇ్లళ్లకు రాష్ట్రవ్యాప్తంగా 12,61,736 దరఖాస్తులు వచ్చాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే సుమారు 7 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అధికారులు దరఖాస్తులు తీసుకోవడాన్ని నిలిపి వేశారు. కానీ, ఇంకా ఎంతోమంది దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవేళ, ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న దాదాపు 13 లక్షల మందికి డబుల్ ఇళ్లు నిర్మించాలంటే దాదాపు రూ.8 లక్షల కోట్లు అవసరం. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ ఎనిమిదిన్నరేళ్లలో దాదాపు మూడు లక్షల ఇళ్లనే మంజూరు చేసింది. గ్రామ స్థాయిలో 1,20,598, పట్టణ స్థాయిలో 1,70,459 కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 2,91,057 ఇళ్లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకూ కేవలం 1.18 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. మరో 69 వేల ఇళ్లు 90 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. నిర్మానం పూర్తయినప్పటికీ దాదాపుగా 60 వేలకుపైగా ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటి వరకూ ప్రారంభించలేదు. అయితే వాటన్నింటినీ దశాబ్ధి ఉత్సవాఇల్లో భాగంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గందరగోళంగా మారిన దరఖాస్తుల పరిశీలన
లెక్కకు మించిన దరఖాస్తులు అందడంతో వారి పరిశీలన, ధృవీకరణ అధికార యంత్రాంగానికి సవాలుగా మారింది. ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు, వచ్చిన దరఖాస్తులకు ఏ మాత్రం పొంతన లేకుండా పోయింది. ఉదాహరణకు, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 14,786 ఇళ్లను మంజూరు చేయగా, 93,275 దరఖాస్తులు అందాయి. జగిత్యాలలో 8,778 ఇళ్లను మంజూరు చేస్తే.. 42,857 దరఖాస్తులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 7,596 ఇళ్లకు గాను.. 48,400, సిద్దిపేటకు 15,773 ఇళ్లను కేటాయిస్తే 38,652, భూపాలపల్లికి 3,882 ఇళ్లకు 22,000, సూర్యాపేట జిల్లాలో 5,614 ఇళ్లకు గాను 15,204, మహబూబాబాద్‌లో 5,542 ఇళ్లకు 13,500, వికారాబాద్ జిల్లాలో 4,109 ఇళ్లకు 17,352, నిర్మల్‌లో 6,801 ఇళ్లకు 19,051, కరీంనగర్‌లో 6,586ఇళ్లకు గాను 21,959 దరఖాస్తులు వచ్చాయి. అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో, నిర్మించిన ఇళ్లు కూడా పంపిణీకి నోచుకోవడం లేదు. దరఖాస్తుదారులు ఎక్కువగా ఉండడం, నిర్మించిన ఇళ్లు తక్కువగా ఉండడంతో వాటి పంపిణీకి అధికారులు సాహసించడం లేదు.