Thursday, November 21, 2024

మ్యాచ్ జ‌రుగుతుండ‌గా ప్యారాచూట్‌తో మైదానంలో దిగిన నిర‌స‌న‌కారుడు

యూరోక‌ప్‌లో భాగంగా మంగళవారం నాడు జ‌ర్మ‌నీ, ఫ్రాన్స్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో ఓ ఆశ్చర్యకరమైన ఘ‌టన చోటు చేసుకుంది. ఓ నిర‌స‌నకారుడు త‌న నిర‌స‌న‌ను వినూత్నంగా చెప్పాల‌ని భావించగగా.. అది కాస్తా చివ‌రికి హింసాత్మ‌కంగా మారింది. పారాచూట్‌తో ఆ నిర‌స‌న‌కారుడు స్టేడియంలోకి రాగానే అక్క‌డి ఓవ‌ర్‌హెడ్ కెమెరా వైర్ల‌కు అది త‌గిలి అదుపు త‌ప్పింది. దీంతో స్టేడియం పైక‌ప్పు కాస్త దెబ్బ‌తిని ఆ ముక్క‌లు అభిమానుల‌పై ప‌డ్డాయి. తృటిలో ఫ్రాన్స్ కోచ్ దిదియ‌ర్ డెశ్చాంప్స్ త‌ప్పించుకున్నాడు.

ఈ ఘ‌ట‌న‌ను యురోపియ‌న్ సాక‌ర్ తీవ్రంగా ప‌రిగ‌ణించింది. స‌ద‌రు నిర‌స‌న‌కారుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పింది. ఆయిల్ వాడ‌కాన్ని ఆపేయండి అంటూ ఆ నిర‌స‌న‌కారుడు నినాదాలు చేశాడు. పార‌చూట్‌పై గ్రీన్‌పీస్ అని రాసి ఉంది. ఆ నిర‌స‌న‌కారుడు గ్రౌండ్‌లో దిగ‌గానే జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్స్ ఆంటోనియో రైగ‌ర్‌, రాబిన్ గోసెన్స్ అత‌ని ద‌గ్గ‌రికి వెళ్లారు. వెంట‌నే సెక్యూరిటీ సిబ్బంది అత‌న్ని బ‌య‌ట‌కు తీసుకెళ్లారు. ఈ యూరోక‌ప్ స్పాన్స‌ర్‌గా ఉన్న ర‌ష్యాకు చెందిన ఇంధ‌న ఉత్ప‌త్తి సంస్థ గాజ్‌ప్రోమ్‌కు వ్య‌తిరేకంగా గ‌తంలోనూ గ్రీన్‌పీస్ నిర‌స‌న‌లు తెలిపింది.

https://twitter.com/FutbolBible/status/1404882413524713475
Advertisement

తాజా వార్తలు

Advertisement