హైదరాబాద్, ప్రభన్యూస్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంతో గ్రామాల్లో నెలకొల్పిన పల్లె ప్రకృతి వనాలు పచ్చదనంతో నిండిపోయాయి. హరితహారం కార్యక్రమానికి ఊతమిచ్చే దిశగా నూతన గ్రామ పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 52(2) ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ 20 వేల మొక్కలను నాటి వాటి యాజమాన్య నిర్వహణ బాధ్యతలను చేపట్టాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,241 నర్సరీలను గ్రామాల్లో ఏర్పాటు చేసి, 19.472 పల్లె ప్రకృతి వనాల అభివృద్ధి చేపట్టారు. అలాగే మండలానికి ఒకటి చొప్పన 521 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఈ వనాలు ఏర్పాటు పూర్తి అయ్యాయి. గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఏ ప్రభుత్వ స్థలాన్ని వదిలిపెట్టకుండా మొక్కలను నాటుతున్నారు.
అవెన్యూ ప్లాంటేషన్, బ్లాక్ ప్లాంటేషన్, బీడు భూములు, చెరువు కట్టల పై నీడనిచ్చే చెట్లతో పాటు కలప, పండ్లు, పూల మొక్కలను నాటుతున్నారు. ప్రత్యేకించి గీత కార్మికులకు ఆదాయం సమకూర్చేందుకు తాటి, ఈత చెట్లను చెరువు గట్లపై నాటుతున్నారు. క్షేత్రస్థాయిలో ఆర్ధిక వనరుల కొరత లేకుండా 10 శాతం నిధులు మొక్కల పెంపకానికి కేటాయిస్తున్నారు.
పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 43 (6),(11) ప్రకారం ప్రతి గృహ యాజమాని ఇంటి ఆవరణలో ఆరు మొక్కలను నాటి సంరక్షించే విధంగా విధానాలను అమలు చేస్తున్నారు. ఈ నిబంధనతో గ్రామీణ ప్రజల్లో పర్యవరణ పట్ల స్పృహ పెరగడమే కాకుండా వృక్ష సంపదను కాపాడుకోవాలనే తపన పెరిగింది. ఇప్పటికి ఆరు హరితహారం కార్యక్రమాలు పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏడో దశ హరితహరం నడుస్తోంది. అనుకున్న 230 కోట్ల మొక్కల నాటే లక్ష్యాన్ని అధిగమించి 239.87 కోట్ల మొక్కలను నాటారు. జాతీయ అటవీ సర్వే ప్రకారం తెలంగాణలో 3.67 శాతం అదనంగా పచ్చదనం పెరిగింది.
లోకల్ టు గ్లోబల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily