Tuesday, November 26, 2024

ఏళ్లతరబడి సమస్యకు ఎట్టకేలకు మోక్షం! టీచర్ల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రభుత్వ ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సంక్రాంతి కానుకను ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లకు లైన్‌ క్లియర్‌ అయింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీంతో ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న టీచర్ల బదిలీలు, పదోన్నతులకు ఎట్టకేలకు మోక్షం లభించినట్లయింది. సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో బదిలీలు, పదోన్నతులు ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు కసరత్తులు చేపడుతున్నారు. మంత్రి హరీష్‌ రావు నివాసంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో బిదిలీలు, ప్రమోషన్లపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదివారం సమావేశం నిర్వహించి అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

మరో రెండుమూడు రోజుల్లోనే పదోన్నతులు, బదిలీలకు సంబంధించి షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. సుమారు 9266 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు పొందనున్నారు. ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్‌ సంక్రాంతి కానుకగా బదిలీలు, ప్రమోషన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని మంత్రి సబిత ఈ సందర్భంగా తెలిపారు. కౌన్సెలింగ్‌ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియను చేపట్టేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -

జూన్‌లో బడులకు కొత్త సార్లు!..

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభంకానుండడంతో ఈ ఏడాది వచ్చే విద్యాసంవత్సరంలో బడులకు ఇక కొత్త సార్లు రానున్నారు. ఎస్జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా, స్కూల్‌ అసిస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు రానున్నాయి. బదిలీలు ఇప్పుడే చేపట్టి టీచర్లకు రిలీవ్‌ చేస్తే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉండడంతో బదిలీలకు సంబంధించిన ఆర్డర్లను ఇప్పుడు జారీ చేసి విద్యార్థుల వార్షిక పరీక్షలు ముగిసిన తర్వాత రిలీవ్‌ చేయనున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 9266 మంది టీచర్లు పదోన్నతులు పొందనున్నారు. ఫిబ్రవరి 10 నాటికి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ పూర్తయ్యేలా షెడ్యూల్‌ విడుదల చేయనున్నారు.

ఇదిలా ఉంటే పదోన్నతుల కోసం టీచర్లు దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో 26,500 సర్కారు బడుల్లో దాదాపు 1.05 లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. 2015లో చివరిసారిగా ప్రమోషన్లను ప్రభుత్వం చేపట్టగా, 2018లో బదిలీలను చేపట్టింది. దాదాపు ఎనిమిదేళ్ల నుంచి ప్రమోషన్లకు, ఐదేళ్ల నుంచి బదిలీలకు టీచర్లు నోచుకోలేకపోయారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అంటే ఏప్రిల్‌ లేదా మేలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఎలాంటి కోర్టు చిక్కులు తలెత్తకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాలను సైతం బుజ్జగిస్తున్నారు. 317 జీవో సమస్యలు, స్పౌజ్‌ కేసులు, బ్లాక్‌ చేసిన 13 జిల్లాల సమస్యలపైన కూడా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నది.

హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు…

బదిలీలు, ప్రమోషన్ల నిర్ణయంపై పీఆర్టీయూటీఎస్‌, ఎస్‌టీయూటీఎస్‌, పీఆర్టీయూ తెలంగాణ, టీఎస్‌యూటీఎఫ్‌, ఎస్‌జీటీ యూనియన్‌, టీర్‌టీఎఫ్‌, టీపీటీఎఫ్‌, టీపీటీఏ, టీయూటీఎఫ్‌, లోకల్‌ క్యాడర్‌ జీటీఏ, తపస్‌, టీటీఏ, ఎస్సీఎస్టీ టీఎఫ్‌ తదితర ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పారదర్శకంగా ప్రక్రియను చేపట్టాలని కోరాయి. 317 జీఓ బాధిత ఉపాధ్యాయుల అప్పీల్స్‌ను పరిష్కరించాలని కోరాయి. 10వేల పీఎస్‌హెచ్‌ఎం పోస్టులకు సంబంధించి జీఓ ఇచ్చి ఈ షెడ్యూల్‌లో అమలు చేయాని విజ్ఞప్తి చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement