- టీచర్ల బదిలీలు, పదోన్నతులకు గ్రీన్ సిగ్నల్
- సీనియారిటి వివరాలు సేకరిస్తున్న విద్యాశాఖ
- సర్కార్ గైడ్‌లైన్‌పై టీచర్ల ఉత్కంఠ
- నేడో రేపో వెలువడనున్న షెడ్యూల్
టీచర్ల బదిలీలకు, పదోన్నతులకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏడున్నర ఏళ్ల తరువాత ప్రమోషన్లు, నాలుగున్నర ఏళ్ల అనంతరం బదిలీలు కల్పించేందుకు సర్కారు సుముఖత వ్యక్తం చేయడంతో టీచర్లు ఆశలపల్లకీలో తెలిపోతున్నారు. మరోవైపు విద్యాశాఖ సీనియరిటీ వివరాలను సేకరిస్తోంది. బదిలీలు, పదోన్నతులపై సర్కారు గైడ్‌లైన్స్‌పై టీచర్లు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావులు ఉపాధ్యాయ సంఘాల నేతలతో ఇప్పటికే సమావేశం నిర్వహించారు. దీంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు నేడో రేపో బదిలీలు, పదోన్నతులపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. – మెదక్ ప్రతినిధి, ప్రభ న్యూస్
టీచర్ల బదిలీలు, పదోన్నతులపై రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో విధివిధానాల రూపకల్పనలో విద్యాశాఖ ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. బదిలీలు, పదోన్నతులు ఎలా ఉండనున్నాయి.? ఏఏ నిబంధనలు ఎవరికి వర్తించనున్నాయనే ఉత్కంఠ ఉపాధ్యాయ వర్గాలో నెలకొంది. పాత విధానంతోనే ప్రక్రియ కొనసాగనుందా? 317 జీవో అమలు, కొత్త జిల్లాలకు క్యాడర్ స్ట్రేంత్ బదిలీల పక్రియపై ఏమైన ప్రభావం చూపనుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. టీచర్ల పదోన్నతులకు సంబంధించి సెంకడరి గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ)లు, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)గా, స్కుల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ)లు ప్రధానోపాధ్యాయులు (హెచ్‌ఎం)గా పదోన్నతులు పొందుతారు. ఎస్‌ఏ పదోన్నతులు జిల్లా వారిగా ప్రధానోపాధ్యాయులే మల్టీజోన్ వారిగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఎస్జీటీలు డీఎస్‌పీలో సాధించిన మెరిట్, రోస్టర్ విధానాలను ప్రమోషన్లకు ప్రమాణికంగా తీసుకుంటారు. యాజమాన్యాలు (ప్రభుత్వ, స్థానిక సంస్థల) వారిగా ప్రక్రియ కొనసాగనుంది. ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఆయా రిజర్వేషన్లకు అనుగుణంగా 15.7 శాతం జిల్లాలో భర్తీ అయ్యేలా చూస్తారు. ప్రమోషన్ల భర్తీలో మంజూరు చేసిన ఉద్యోగాల్లొ 70 శాతం ప్రమోషన్లతో మరో 30 శాతం నియమాకాల ద్వారా చేపట్టనున్నారు. బదిలీ విషయానికి వస్తే ప్రస్తుతం పనిచేస్తున్న చోట 8 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వర్తింపజేస్తారు. పోస్టులు కేటాయించే క్రమంలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రధానోపాధ్యాయులకు మాత్రం ఐదేళ్లు ఒకే దగ్గర విధులు నిర్వర్తించిన వారికి బదిలీ వర్తించనుంది.
చర్చంతా 317 జీవో వైపే..
ప్రస్తుతం టీచర్ల చర్చంతా 317 జీవో చూట్టే సాగుతోంది. గతంలో ఉన్నట్లే విధివిధానాలు ఉంటాయా.? ఇటీవల చేపట్టిన క్యాడర్ స్ట్రెంత్ బదిలీల్లో స్థాన చలనం జరిగిన వారిపై ప్రభావం ఉండనుందా.? అనే సందేహాలు ఉపాధ్యాయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. తాజాగా చేపట్టనున్న బదిలీలో భాగంగా సీనియరిటీ విషయంలో పలువురు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. తమకు నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాలతో పలువురు విజ్ఞప్తులు చేయనున్నట్లు సమాచారం. భాషాపండితుల పోస్టుల ఆప్‌గ్రేడ్, ప్రమోషన్ల అంశం కోర్టులో ఉండడంతో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుందోనని వారు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. వారు మాత్రం మిగతా వారితో పాటే తమకు ప్రక్రియ వర్తింపజేయాలని కోరుతున్నట్లు సమాచారం. ఆయా కేటగిరిల్లో స్కూల్ అసిస్టెంట్లు హెచ్‌ఎంలుగా పదోన్నతి ఏ విధంగా ఉండనుందోనన్న చర్చ ఉపాధ్యాయ వర్గంలో నెలకొంది. మెదక్ జిల్లాలో మొత్తం 1,626పోస్టులకు గాను 348 ఖాళీలు, 281 ప్రమోషన్లు ఉండనున్నట్లు సమాచారం.
సీనియార్టి వివరాలు సేకరిస్తున్నాం – రమేష్‌కుమార్ జిల్లా విద్యాధికారి మెదక్
పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ప్రస్తుతం అంతర్గతంగా సర్వీస్ సీనియారిటి వివరాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతోంది. ఉన్నతాధికారులు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి బదిలీలు, పదోన్నతులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మార్గదర్శకాలు విడుదల అయ్యాక ఖాళీలను అధికారికంగా వెల్లడిస్తాం. రెండుమూడు రోజులో పూర్తిస్థాయిలో స్పష్టత రానుంది.
హర్షనీయం – మల్లారెడ్డి పిఆర్ టీయు
పిఆర్‌టియు రాష్ట్ర శాఖ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కృషి ఫలితంగా ప్రభుత్వం సానుకులంగా స్పందించి టీచర్ల బదిలీలు, పదోన్నతులు చేపట్టడం హర్షనీయం. పండిత్‌లు, పిఇటి పోస్టులు కూడా అప్‌గ్రేడేషన్ కోర్టు తీర్పుకు లోబడి సమస్య పరిష్కరించాలి. ఈ సందర్భంగా పిఆర్‌టియు రాష్ట్ర నాయకత్వానికి, ఎమ్మెల్సీలకు కృతజ్ఞతలు.
ఐక్య పోరాటాలతో బదిలీలు, పదోన్నతులు – వెంకట్రామిరెడ్డి టిపిటిఎఫ్
గత కొన్నేళ్లుగా టీచర్ల బదిలీలు, పదోన్నతులపై ఐక్యపోరాటాలు కొనసాగుతున్నాయి. విద్యారంగంలో సమూల మార్పులు తెచ్చేందుకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించాం. పోరాటాలకు తలొగ్గిన రాష్ట్ర సర్కార్ ఎట్టకేలకు బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు ముందుకొచ్చింది. పారదర్శకంగా ప్రక్రియ కొనసాగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.